4 March, 2026 | 6:07 PM

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

04-03-2026 04:28 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ యార్డులోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోహర్ రైతులకు సేంద్రియ వ్యవసాయం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. కాగజ్‌నగర్ మండలంలోని కోసినీ గ్రామాన్ని ఎంపిక చేసి 125 మంది రైతులకు సేంద్రియ ఎరువులు, జీవామృతం, వర్మీ కంపోస్ట్, ఘనజీవామృతం తయారీ విధానంపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా భూమి సారాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి రైతు తమ భూమికి సంబంధించిన మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. అలాగే నానో ఎరువుల వినియోగం పెంచుకుని, ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాయని వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు.

సాగు విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. కోసినీ గ్రామంలో ఇప్పటికే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కొంతమంది రైతుల అనుభవాలను సమావేశంలో పాల్గొన్న రైతులతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం చేపట్టినప్పుడే భూమి ఆరోగ్యం కాపాడబడుతూ, పంటల పోషక విలువలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు  శ్రీనివాస్, దుర్గాభవాని, సృజన, సీఆర్‌పీలు, రైతులు పాల్గొన్నారు.