డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్
రెండు రోజుల జైలు శిక్ష...
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా, మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇల్లందుకు చెందిన టి. మధు కుమార్, ఆటో డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవి కుమార్ విచారించి, నిందితుడికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ జి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, కొత్తగూడెం పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని,వాహనంపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించిన వారు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించుకోవాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని ప్రజలకు సూచించారు.






