ఆయిల్‌పాం రైతులకు మహర్దశ
- పామాయిల్ సాగుకు బాటలు వేసిన మంత్రి తుమ్మల
- రైతులు తలరాత మార్చిన మహర్షి
- నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయిల్ ఫామ్
- కురియన్ గా నిలిచిన తుమ్మల
- నేషనల్ మిషన్ ఆన్ ఏడిబుల్ ఆయిల్స్ పథకం లో మొదటి స్థానంలో తెలంగాణ
- జాతీయ ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ వాటా 36 శాతం
- తెలంగాణ లో 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న 79,448 మంది రైతులు
- తెలంగాణ వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్ గా ఆయిల్ ఫామ్ సాగు
ఖమ్మం, జులై 19(విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ సాగు విస్తరణలో మార్గదర్శిగా నిలిచారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నలబై ఏళ్ల క్రితం మంత్రి తుమ్మల దార్శనికత నేడు తెలంగాణ రైతాంగానికి వరంగా మారింది. రైతులు తలరాత మారేలా పామాయిల్ సాగుకు బాటలు వేశారు. దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. లక్షలాది రైతుల కుటుంబాల్లో వ్యవసాయం పండుగలా మారేలా మంత్రి పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టారు?.
తెలంగాణ ఆర్ధిక ప్రగతిలో పామాయిల్ సాగు గేమ్ చేంజర్ గా మారనుంది..? తెలంగాణ రైతాంగానికి వరంగా మారిన పామాయిల్ సాగు ప్రస్థానం ఇలా.. వ్యవసాయ రంగంలో ఆయిల్ ఫామ్ సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తుంది. ఎకరాకు రెండు లక్షల ఆదాయంతో రైతులు తలరాత మారుతుంది.
ఒక్కసారి మొక్క నాటితే నలభై ఏళ్ళ పాటు దిగుబడులు ఉంటాయా? దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా తెలంగాణ మారబోతోందా? నలభై ఏళ్ళుగా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ కు బాటలు వేసి మంత్రి తుమ్మల ఆయిల్ ఫామ్ కురియన్ గా మారారా? అనే ప్రశ్నలకు నిజమనే సమాధానం రైతులు నుంచి వస్తోంది. దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగులో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచిందంటే ఆయిల్ పామ్ సాగు పై మంత్రి తుమ్మల కృషి వర్ణించలేనిది.. తెలంగాణ వ్యవసాయ రంగంలో ఆయిల్ ఫామ్ సాగు గేమ్ చేంజర్ గా మారింది.
పామాయిల్‌కు శ్రీకారం చుట్టింది తుమ్మల..
పామాయిల్ అనగానే గుర్తొచ్చే పేరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నలభై ఏళ్ల క్రితం పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టిన మంత్రి తుమ్మల దార్శనికత నేడు తెలంగాణ రైతాంగానికి వరంగా మారింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. జాతీయ ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ వాటా 36 శాతం గా నమోదు అయింది.
దేశ వ్యాప్తంగా 2021_2026 మధ్య 2.73 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు అవ్వగా అందులో తెలంగాణ లో 98,112 హెక్టార్లలో సాగుతో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ లో ప్రస్తుతం 1.16 లక్షల హెక్టార్లలో 79,448 మంది రైతులు పామాయిల్ సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ టన్ను గెలలు ధర 23 వేల 852 రూపాయలు ఉండటంతో రైతన్నల్లో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చలు చూస్తే తెలంగాణ వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్ గా కనిపిస్తుంది.
ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే పామాయిల్ సాగు..
పామాయిల్ సాగు ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే శక్తి ఉంది. చీడ పీడలు లేకుండా కోతుల బెడద లేకుండా రైతులకు కష్టాలు కన్నీళ్ళు అప్పులు లేకుండా దీర్ఘ కాలం లాభాలతో రైతన్న ఇంట సిరులు కురిపించే పంటగా మారింది. ఆయిల్ ఫామ్ సాగు నలబై ఏళ్ల క్రితం ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి తెలంగాణ రైతులు తలరాత మారేలా మార్గదర్శి గా నిలిచారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది.
పెరుగుతున్న ఆయిల్ ఫామ్ గెలలు ధరలు..
రోజురోజుకు ఆయిల్ పామ్ గెలల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరిగి టన్ను పాతిక వేల రూపాయలు ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన వంట నూనెల చరిత్ర చూస్తే దిమ్మతిరిగే లెక్కలు కనిపిస్తాయి. అవును మీరు విన్నది నిజమే. ప్రతి ఏడాది మన దేశం దిగుమతి చేసుకున్న వంట నూనెల విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా లక్షా 50 వేల కోట్లు. అందులో సగానికి పైగా అరవై శాతం పామాయిల్ నూనెదే సింహభాగం. ఏడాదికి రెండు వందల లక్షల టన్నుల వంట నూనెలు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? మన దేశ జనాభా కు తగ్గ స్థాయిలో వంట నూనెల పంటల సాగు లేదు?
మొదటి మొక్కను నాటిన ఎన్టీఆర్..
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెదవేగి నుంచి ఓ పామాయిల్ మొక్క తెప్పించి ఎన్టీఆర్ చేతుల మీదుగా నాటించి, నాటి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పామాయిల్ సాగుకు శ్రీ కారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నే కాదు తెలంగాణలో పామాయిల్ తొలి సాగుకు బాటలు వేసారు మంత్రి తుమ్మల. తొలుత తన వ్యవసాయ క్షేత్రం దమ్మపేట మండలం గండుగులపల్లి లో పామాయిల్ సాగుకు శ్రీ కారం చుట్టారు తుమ్మల.
ఆయన తో పాటు మరికొంత మంది ఔత్సాహిక రైతులు పామాయిల్ సాగు చేసారు. అలా మొదలైన పామాయిల్ సాగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రస్తుతం 80 వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. అశ్వారావుపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పామాయిల్ రైతులు సాగు విస్తీర్ణం పెంచారు.
పామాయిల్ సాగు కు బాటలు వేసిన తుమ్మల దమ్మపేట మండలం అప్పారావుపేటలో నూతన పామాయిల్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వంలో నెలకొల్పారు. దాంతో పామాయిల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. వ్యవసాయం చేయడమే కాదు తోటి రైతులను రాజుగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా 20లక్షల ఎకరాల్లో పామా యిల్ సాగుకు క్యాబినేట్‌లో ఆమోదం చేయించి తుమ్మల చరిత్రలో నిలిచారు.
ఆయిల్ పామ్ హబ్ గా తెలంగాణ..మంత్రి తుమ్మల
పామాయిల్ పంటలకు చీడ పీడల బెడద తక్కువ.తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్న పంట. గత పదేళ్ల కాలంలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగింది.తెలంగాణ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన పామాయిల్ సాగు మంత్రి తుమ్మల చొరవతో అన్ని జిల్లాలకు విస్తరించింది. రేవంత్ సర్కార్ ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ కు పెద్దపీట వేశారు. అక్కడే పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ టార్గెట్ గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పట్టుదలగా ఉన్నారు. ఆయిల్ పామ్ సాగు లో యావత్ దేశానికే తెలంగాణ హబ్ గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ మంత్రి తుమ్మల పై పామాయిల్ రైతాంగం ప్రశంసలు
ఆయిల్ పామ్ సాగుకు బాటలు వేసి లక్షలాది మంది రైతులకు మార్గదర్శి గా మంత్రి తుమ్మల మారారని రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు.గత నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తుమ్మల రైతాంగం తలరాత మార్చటానికి రైతు బిడ్డగా రైతుగా తోటి రైతులు తలరాత మార్చి ముందు తరాలకు మేలు చేసేలా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేపట్టగా అండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సా హంతో తెలంగాణ ఆయిల్ ఫామ్ హబ్ గా మారేలా బాటలు వేస్తున్నారు.
దేశంలోనే ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపి తుమ్మల చరిత్రలో నిలిచారని రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పొలం బాట పట్టేలా ఆయిల్ ఫామ్ సాగు మారింది. రానున్న రోజుల్లో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ప్రగతి బాటలో ఉండటమే కాదు,
పచ్చదనం తో పాటు తెలంగాణ జిడిపి లో ఆయిల్ ఫామ్ సాగు కీలకంగా మారుతుందని వ్యవసాయ రంగంలో దేశానికే మార్గదర్శి గా తెలంగాణ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల చరిత్రలో నిలుస్తారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






