23 July, 2026 | 3:38 AM

ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి

23-07-2026 12:00 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జూలై -22 (విజయక్రాంతి): త్రాగునీటిని కాపాడుకుంటూ, రైతులు అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కలిసి వి. వెంకటాయ పాలెం డీప్కట్ వద్ద గోదావరి జలాల పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం అధికారులు, ఇంజినీర్లతో ప్రస్తు త నీటి లభ్యత, త్రాగునీటి సంరక్షణ, గోదావరి జలాలను ఖమ్మం వైపు మళ్లించే కార్యా చరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ప రిమితంగా ఉన్నందున ప్రతి చుక్క నీటిని జా గ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా రైతులు ఆయిల్పామ్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి తక్కువ నీటిఅవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు.

ఏప్రిల్ 2026 నుంచే అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్న ప్పటికీ రైతులు వరి సాగుపై పట్టుబడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. 1977లో వచ్చిన కరువు కంటే ప్రస్తుతం వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న సూప  ర్ ఎల్నినో ప్రభావం మరింత తీవ్రమై ఉండే అవకాశముందని అన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దీని ప్రభావం పెరిగి భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉందని, త్రాగునీటి పరిరక్షణపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఖమ్మం జిల్లాకు కృష్ణా జలాలు మాత్రమే సరిపోవని, దశాబ్దాలుగా గోదావరి జలాలను తీసుకురావాలనే ప్రజల ఆకాంక్ష ఉందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి శ్రీరాముడి పేరుతో ’సీతారామ’ ప్రాజెక్టుగా నామకరణం చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ద్వారా గో దావరి జలాలు జిల్లాకు అందుతున్నాయని చెప్పారు.

ఇంజినీర్ల సూచనల మేరకు వైరా కు తరలించిన గోదావరి నీటిని రాజీవ్ కాలు వ షట్టర్లు మూసివేసి తిరిగి ఖమ్మం వైపు మళ్లించే ప్రయోగం జరుగుతోందన్నారు. మంచుకొండతో పాటు ఇతర ఎత్తిపోతల వ్యవస్థల ద్వారా చెరువులు నింపి, మంచుకొండ ఓవర్ఫ్లోను మున్నేరులోకి మళ్లించడం ద్వారా ఖమ్మం నగర త్రాగునీటి అవసరాలను తీర్చేప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

అవసరమైతే డీప్కట్ నుంచి మంచుకొండకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే అత్యవసర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సుమారు రూ.90 కోట్లతో నిర్మించిన రాజీవ్ కాలువ వల్ల రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఏర్పడిందని, ఇది సాగునీటి రంగంలో విశేష విజయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సూచనలు అందించి విజయవంతంగా పూర్తి చేసిన ఇంజినీర్లను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, సిఇ ఇర్రిగేషన్ శ్రీనివాస రెడ్డి, ఎం. వెంకటేశ్వర్లు, డిపిఓ రాంబాబు, వివి పాలెం గ్రామ సర్పంచ్ కాపా ఆదినారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.