మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
వివాహ వేడుకలో అత్యంత సమీపం నుంచి కాల్పులు
శ్రీనగర్, మార్చి 12: జమ్మూ కశ్మీర్ మా జీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు అనుమానితుడిని అరె స్టు చేసి, దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘జమ్మూలో ని గ్రేటర్ కైలాష్‌లోని రాయల్ పార్క్‌లో బుధవారం సాయంత్రం జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఫరూక్ అబ్దుల్లాపై ఓ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, భద్రతా సి బ్బంది అప్రమత్తమై దాడిని విఫలం చేశారు. ఫరూక్ అబ్దుల్లా వేడుకలో ఉండగా, ఓ వ్యక్తి ఆయనకు అత్యంత సమీపంగా వెనుక నుం చి వచ్చాడు.
తుపాకీతో ఫరూక్‌పై గురిపెట్టి కాల్పులు జరపబోయాడు. అయితే, వెంటనే స్పందించిన జెడ్-ప్లస్ భద్రతలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కమాండోలు దుండగుడిని పక్కకు నెట్టేశారు. దీంతో తూటా గురి తప్పి ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సం బంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చా యి. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని జమ్మూలో ని పురానాస్ మండీకి చెందిన కమల్ సింగ్ జమ్వాల్ (65)గా గుర్తించారు. ఈ ఘటనపై ఫరూక్ కుమారుడు, సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా తన తండ్రిపై జరిగిన హత్యాయత్నమేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ‘అల్లా దయవల్ల మా నాన్న త్రుటిలో తప్పించుకున్నారు అని అన్నారు.




