07-02-2026 12:00:00 AM
48 గంటల్లో నిందితుడి అరెస్ట్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పట్టపగలు కాదు& రాత్రి వేళల్లో నిర్జన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి దోపిడీలు చేసే ఘటనలపై కట్టడి లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, మహాప్రస్థానం సమీపంలో జరిగిన దాడిదోపిడీ కేసును రాయదుర్గం పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. బాధితుడు మహమ్మద్ ఒవైసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, గస్తీ బృందాల సమాచారం తో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 3వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో నిందితుడు మహమ్మద్ జావీద్ బాధితుడిపై రాయితో దాడి చేసి గాయపరిచి, అతని మొబైల్ ఫోన్ లాక్కొని, యూపీఐ ఖాతా ద్వారా రూ.400 బదిలీ చేయించుకుని ద్విచక్ర వాహనంపై పరారైనట్లు దర్యాప్తులో తేలింది.
అనంతరం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి ఈ నెల 6వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి దొంగిలించిన మొబై ల్ ఫోన్తో పాటు మరో రెండు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు రాయదుర్గం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ టి. భూపతి తెలిపారు. నగరంలో ఇలాం టి దాడులు, దోపిడీలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని పోలీసులు సూచించారు.