07-02-2026 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 6, (విజయక్రాంతి): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు వండర్ అనేది ఎంత నిజమో ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలను పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరో ఎత్తుగా మారింది.
మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేయాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఐ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న ఆ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీ నెలకొంది. సిపిఐ తన స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ బాగా వెయ్యటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
సిపిఐ తరుపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు, అధికార పార్టీ తరఫున రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఎన్నికల ప్రచారం లోనూ పరస్పరంగా ఘాటైన విమర్శలతో కత్తులు దోచుకుంటున్నారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రంగురంగుల జండాలు వేసుకొని సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళ మాటలు నమ్మవద్దని,
అభివృద్ధి జరగాలన్న సంక్షే మ పథకాలు అర్హులకు దరి చేరాలన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సూటిగా సిపిఐపై విమర్శల హస్త్రం గుప్పించారు. దానికి దీటుగా కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మె ల్యే సాంబశివరావు మాట్లాడుతూ అహంకారులకు కార్పొరేషన్ ఎన్నికలు తగిన గుణ పాఠంగా మారాలంటే సిపిఐ, తెలుగుదేశం బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఘాటైన విమర్శ చేశారు. దీంతో నిన్న మొన్నటి వరకు చట్టపట్టాలు వేసుకుని తిరిగిన సిపిఐ, కాంగ్రెస్ పార్టీల వైరుధ్యం పెరిగినట్టు స్పష్టమవుతుంది.
మారిన రాజకీయ పరిణామాలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, సిపిఐ మిత్రపక్షులుగా పోటీ చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు కంచుకోట అయిన కొత్తగూడెం నియోజకవర్గ స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించారు. ఆనాడు సిపిఐ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు కాంగ్రెస్ మద్దతుతో విజయ దుందుభి మోగించారు. ఆనాటి నుంచి కాంగ్రెస్, సిపిఐ పార్టీలు చట్టా పట్టాలు వేసుకొని ముందుకు సాగాయి.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయతీలో తలెత్తిన అభిప్రాయ భేదాలు చిలికి చిలికి గాలి వానగా మారి రెండు పార్టీలు కత్తులు దోచుకునే వరకు వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లోను రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ లోని ఏడు పంచాయతీలను కలిపి నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా వేగర వేయటానికి రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎవరు పట్టు సాధిస్తారనేధి ఓటర్ల దేవుళ్ళు చేతుల్లో ఉంది.
వామపక్షాలు చేరోవైపు..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ సిపిఎం చెరో వైపు చేరాయి. కాంగ్రెస్ పార్టీ సిపిఎంతో పొత్తు పెట్టుకోగా, సిపిఐ, తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని బరిలోకి దిగాయి. బిఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. కార్పొరేషన్ లోని 60 డివిజన్లలో రెండు డివిజన్లను సిపిఎం పార్టీకి కేటాయించి, మిగిలిన 58 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మరో కూటమిలో తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాలు, సిపిఐ 55 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగామారాయి అనడంతోలు సందేహం లేదు.