సీజేపీ నేతలపై దాడి
- జైపూర్‌లో రాళ్లు విసిరి, బురద చల్లుతూ దాడులు
- అధికార ప్రతినిధి సహా ఐదుగురికి గాయాలు
- కన్వర్‌పురా పాఠశాల తనిఖీకి వెళ్లగా ఘటన
- విద్యాశాఖ మంత్రి, బీజేపీ దాడికి పాల్పడిందని సీజేపీ ఆరోపణ
- సీజేపీ నాయకులు గ్రామంలోకి రావొద్దని గ్రామస్థుల ధర్నా
జైపూర్, ఆగస్టు 21: జైపూర్‌లో పాఠశాల తనిఖీకి శుక్రవారం వెళ్లిన సీజేపీ (కాక్రోజ్ జనతా పార్టీ) అధికార ప్రతినిధి, ఆయన స హచరులపై స్థానికులు దాడి చేశారు. మొద ట గ్రామశివారులోనే రావొద్దని గ్రామస్థులు హెచ్చరించినా, వినకపోవడంతో సీజేపీ వాహనాలపై రాళ్లు రువ్వారు. పలువురు బుదర చల్లుతూ దాడులు చేశారు. ఈ ఘటనలో సీజేపీ నాయకుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. విద్యాశాఖ మంత్రి, బీజేపీ తమపై దాడికి పాల్పడిందని సీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ ఆరోపణలను గ్రామస్తులు తోసిపుచ్చారు. గ్రామంలోకి వారు రావొద్దని ధర్నా చేశారు. ‘పాఠశాల బాగు చేయండి’ అనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జైపూర్‌లోని బగ్రూ రాంపూరా కన్వర్‌పురా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లారు. వీరి రాకను గ్రామశివారులోనే గమనించిన స్థానికులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వారు వినకపోవడంతో వాహనాలపై రాళ్లు విసిరారు. అశుతోష్‌తోపాటు వచ్చిన మహిళపై కూడా గ్రామంలోని పలువురు మహిళలు బురద చల్లారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడిలో కార్ల అద్దాలు ధ్వంసమ య్యాయి. సీజేపీ నాయకుడు, కార్యకర్తల వద్ద ఉన్న ఫోన్లు పగిలాయి. ఈ దాడిలో అశుతోష్‌తో సహా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిని చేయించింది విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీకి చెంది న వారేనని సీజేపీ ఆరోపించింది. సీజే పీ ఆరోపణలను గ్రామస్థులు తోసిపుచ్చారు. తమ గ్రామంలోకి ఎవరినీ అనుమతించబోమని చెప్పినా వినకుండా తమపై దాడిచేసేం దుకు ప్రయత్నించారని, దీంతో గ్రామస్థులు కోపోద్రిక్తులై వారిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సీజేపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోకి రావొద్దని ధర్నా నిర్వహించారు.
కాగా రాంపురా కన్వర్పురా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో దీన్ని మూసివేశారు. పిల్లలకు వేరేచోట రేకుల షెడ్డు ఏర్పాటు చేసి బోధిస్తున్నా రు. దీనికి దగ్గరలోనే పశువుల శాల, వాటి మేత కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అక్కడి వాతావరణం దుర్గంధ పూరితంగా కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న సీజేపీ పాఠశాలను సందర్శించేందుకు వస్తుండగా వారిపై దాడి జరిగింది. కాగా పాఠశాల ని ర్మాణానికి ప్రభుత్వం రూ.12.5 లక్షలను మంజూరు చేసింది. గ్రామస్థులు తాము పాఠశాలను నిర్మించుకునే వరకు పిల్లలకు తాత్కాలికంగా ఇక్కడ బోధనకు ఏర్పాటు చేశామని చెబుతున్నారు.
48 గంటల్లోగా అరెస్టు చేయాలి: అభిజీత్ దీప్కే
సీజేపీ నాయకులపై దాడి చేసిన వారిని 48 గంటల్లోగా అరెస్టు చేయకుంటే తానే జైపూర్‌కు వస్తానని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదని, ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే తమపై చేసిన దాడి అని ఆయన ఆరోపించారు. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భద్రత పేరుతో పాఠశాలల్లో లోపాలను బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కనీసం మీడియాను కూడా అనుమతించకపోవడం వీడియో, ఫొటోలు కూడా తీయకుండా నిషేధించే మార్గదర్శకాలను జారీ చేయడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.






