జబ్ తలక్.. దిల్ ధడ్కే!
షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘కాక్‌టైల్ 2’. ఈ చిత్రానికి హోమీ అడ్జానియా దర్శకత్వం వహిస్తుండగా, లవ్ రంజన్ కథను అందించారు. మాడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. 2012లో ప్రేక్షకాదరణ పొందిన ‘కాక్‌టైల్’కు సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. ఇందులో రష్మిక, కృతి సనన్ లెస్బియన్ జంటగా కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రంలోని తొలిగీతం ‘జబ్ తలక్’ విడుదలైంది. ‘జబ్ తలక్ యే సాన్సే హై.. మేరా ఇష్క్ తూ హీ హై.. జబ్ తలక్ యే దిల్ ధడ్కే.. తేరీ యాద్ హీ రహే.. తూ హీ మేరీ మంజిల్ హై, జబ్ తలక్ యే రాస్తా హై..’ అంటూ సాగుతోందీ గీతం.
జీవితాంతం తోడుంటాననే వాగ్దానం చేస్తూ ప్రేమికుడు తన మనసులోని భావాలను వ్యక్తపరిచే ఈ పాట ఇది. బీచ్ పార్టీ నేపథ్యంలో సాగే ఈ పాటలో షాహిద్, కృతి, రష్మికల మధ్య ఉండే స్నేహపూర్వక బంధాన్ని పార్టీ మూడ్‌లో అందంగా చూపించారు.




