ORRపై భారీ అగ్నిప్రమాదం: ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం
హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్(Pedda Amberpet) సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై(ORR service line) మంగళవారం నాడు ఒక ఎయిర్ ఇండియా బస్సు(Air India Passenger bus catches fire ) అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. నివేదికల ప్రకారం, శంషాబాద్ విమానాశ్రయ వర్క్‌షాప్ నుండి సర్వీసింగ్ కోసం ఆటోనగర్‌కు వెళ్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
తీవ్రమైన వేడి కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, నిమిషాల వ్యవధిలోనే వాహనాన్ని చుట్టుముట్టాయి. సంఘటన జరిగిన సమయంలో బస్సు లోపల ఉన్న డ్రైవర్, క్లీనర్ మంటలను గమనించి, బయటకు దూకి సురక్షితంగా తప్పించుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






