మంత్రి రిబ్బన్ కట్ చేసి 10 ఏళ్లు.. దివ్యాంగులకు దక్కని కమ్యూనిటీ హాల్
అధికారుల నిర్లక్ష్యం.
రాష్ట్ర దివ్యాంగుల కమిషనర్ సీరియస్.
జిల్లా, మండల అధికారులకు నోటీసులు
తాండూరు, మే26, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దెముల్ మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం లక్షలాది రూపాయలతో ఖర్చుపెట్టి నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను(Community Hall) పదేళ్లుగా వారికి అప్పగించకపోవడంపై రాష్ట్ర దివ్యాంగుల కమిషనరేట్ సీరియస్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే 2016లో అప్పటి మంత్రి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వికలాంగుల కమ్యూనిటీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ భవనం ఇప్పటివరకు దివ్యాంగులకు దక్కకపోవడం గమనార్హం. డిసెబిలిటీ,రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర యాదయ్య గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ శైలజ స్పందించారు. జిల్లా ప్రజా పరిషత సీఈవో, పెద్దేముల్ ఎంపీడీవో లకు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు పంపారు.
ఆ భవనాన్ని వెంటనే దివ్యాంగుల కమ్యూనిటీకి లేదా సంఘానికి అప్పగించాలని కూర యాదయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కోసం కట్టిన కమ్యూనిటీ భవనం మాకు దక్కకుండా అధికారులు ఏం చేస్తున్నారు? 10 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఆ భవనం ఎవరి ఆధీనంలో ఉంది? దేనికి వాడుతున్నారని? ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలతోనైనా అధికారులు కళ్లు తెరిచి, వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవనాన్ని వికలాంగులకు అప్పగించాలని స్థానికులు, వికలాంగులు కోరుతున్నారు.






