ఇంకెంతకాలం వెట్టిచాకిరి?
సమరానికి సన్నద్ధమవుతున్న ఆర్టిజన్లు
మహబూబాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): చాలీచాలని వేతనంతో ఏండ్ల తరబడిగా విద్యుత్ శాఖలో విద్యుత్ సరఫరా, నియంత్రణ లో కీలక భూమిక పోషిస్తున్న ఆర్టిజన్లు న్యాయమైన హక్కుల సాధన కోసం సమరానికి సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో 23,000 మందికి పైగా ఆర్టిజన్లు, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్ కార్మికులను రెగ్యులర్ చేయడంతోపాటు పనికి తగ్గ వేతనం చెల్లించాలనే డిమాండ్ తో ఈనెల 10న టీఎస్పీడీసీఎల్ సెక్రటేరియట్ ఆఫీస్ ఎదుట మహాధర్న నిర్వహించడానికి నిర్ణయించారు.
ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేసి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి శాఖలో ఉద్యోగుల నియామకం క్రమబద్ధీకరణ సర్వీసు రూల్స్ ఒకే విధంగా ఉంటాయని, అయితే విద్యుత్ శాఖలో మాత్రం రెండు రూల్స్ అమలు చేస్తూ కొంత మందికి న్యాయం చేస్తూ, మరి కొంతమందికి అన్యాయం చేస్తున్నారని ఆర్టిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1947 బ్రిటిష్ కాలం నాటి చట్టం స్టాండింగ్ ఆర్డర్ ను అమలు చేసి 8 సంవత్సరాలు గడుస్తుండగా, 2019లో రిక్రూట్మెంట్ అయిన జేఎల్‌ఎం లకు ఏపీఎస్‌ఈబి సర్వీస్ రూల్స్ వర్తింపజేసి ప్రమోషన్లు ఇచ్చారని, 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఆర్టిజన్లకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ పెట్టి కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ ఎలాంటి ప్రమోషన్ లేకుండా, గ్రాడ్యుటీ, పే లివ్స్, ఇంక్రిమెంట్లు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీఎస్‌ఈబి రూల్ అమలు చేయాలని, విద్యుత్ సంస్థల పరిధిలో పనిచేస్తున్న వారందరికీ ఒకే విధానం అమలు చేయాలని ఏండ్ల తరబడిగా ప్రభుత్వానికి, విద్యుత్ అధికారులకు మొరపెట్టుకుంటున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన కోరికల సాధన కోసం అనేక పర్యాయాలు ఆందోళనలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న లోపాలను సరిదిద్దడం, ప్రాణాలను పణంగా పెట్టి వీధి నిర్వహించడం, అనేకమంది విద్యుత్ ఘాతానికి బలై మర ణించారని, అయినా సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
కుటుంబ పోషణ కోసం, భవిష్యత్తుపై ఆశతో ఏండ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమను గుర్తించకపోవడం తగదన్నారు. 2016 ఏప్రిల్ 3 వరకు అన్ని అర్హతలు ఉండి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత కూడా విధులు నిర్వహిస్తున్న కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, రెండు సర్వీస్ రూల్స్ రద్దుచేసి, ఏకీకృత సర్వీస్ రూల్ అమలు చేయాలనే డిమాండ్ తో ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో ఈనెల 10న ఎస్పీడీసీఎల్ సెక్రటేరియట్ కార్యాలయం ఎదుట 9 ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో ఏర్పడ్డ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం చైర్మన్ ధరావత్ సికిందర్ తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోతే అదే రోజు సమ్మె నోటీసు కూడా ఇచ్చి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత, పనికి తగ్గ వేతనం, ఇతర సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి కార్మికులు సమరబాట పడుతున్నారు.




