10 April, 2026 | 8:08 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి

10-04-2026 05:42 PM

– జిల్లా కలెక్టర్ హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో రహదారి భద్రతపై చేపట్టనున్న ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని పకడ్భందిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా,  ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు.

ఏప్రిల్ 13: ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి.

ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా రహదారి భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించాలి.

ఏప్రిల్ 15: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించడం, రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించాలి.

ఏప్రిల్ 16: పెట్రోల్ బంకుల వద్ద “నో హెల్మెట్ – నో పెట్రోల్” బోర్డులు ఏర్పాటు చేయాలి.

ఏప్రిల్ 17: ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లు, వాహనదారులకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

ఏప్రిల్ 18: మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో హెల్మెట్, సీటుబెల్ట్ ధరించిన వాహనదారులను విద్యార్థుల ద్వారా అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేయాలి.

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు, అధికారులు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్, లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.