25 February, 2026 | 8:37 PM

ఆర్టీసీ అధికారుల కుప్పిగంతులు

25-02-2026 06:33 PM

 - స్టే ఉన్నా పనులకు శ్రీకారం

- స్టే ఉన్న విషయం కాంట్రాక్టర్ కు తెలపని ఆర్టీసీ అధికారులు

- ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులను నిలిపివేత

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ ఆర్టీసీ అధికారుల కుప్పిగంతులకు చివాట్లు తినాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ కాలానీకి వెళ్లే వైపు ప్రహరీ నిర్మాణ  పనులు చేపట్టవద్దని హైకోర్టు స్టే విధించినప్పటికీ చకా చకా పనులు చేయించాలని నిశ్చయించుకున్న ఆర్మూర్ ఆర్టీసీ అధికారులకు చివాట్లు తప్పలేదు. స్టే ఉందని తెలుసుకున్న గుతేదారు పనూలు నిలిపివేసి వెళ్లిపోయారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి రోడ్డు సమస్య ఉంది. ఈ కాలనీకి వెళ్లాలంటే ఆర్టీసీ నుంచి కేటాయించిన స్థలం నుంచే వెళ్లాలి.

గత కొన్ని దశాబ్దాలుగా వాడుకుంటున్నప్పటికీ రాత పూర్వకంగా లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రహరీ గోడను నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పనులను ఆపేందుకు ఎన్టీఆర్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్, ఆర్టీసీ,  రెవెన్యూ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దృష్టికి పలుమార్లు రోడ్డు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు ప్రహరీ గోడ నిర్మాణం చేసేందుకు సన్నద్ధం కావడంతో విజయ అగర్వాల్ సహకారంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మూడు వారాలు కోర్టు స్టే విధించింది.

మూడు వారాల్లో కాలనీ వాసులకు రోడ్డు చూయించి ప్రహరీ పనులు  నిర్మించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ అధికారులు రాత్రి వేళల్లో ప్రహరీ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసుకుంది. బుధవారం ఉదయం ప్రహరి నిర్మించేందుకు గుత్తేదారు సిద్ధమయ్యారు. పనులు చేయకూడదని స్టే ఉన్నా ఎందుకు చేస్తున్నారని గుత్తేదారును కాలనీవాసులు ప్రశ్నించడంతో అవాక్కయ్యాడు. హైకోర్టులో స్టే ఉన్న విషయం తనకు తెలియదని ఆర్టీసీ అధికారులు తనకు చెప్పలేదని అందుకే ప్రహరి నిర్మాణ పనులు చేపడుతున్నానని చెప్పాడు.

దీంతో కాలనీవాసులు స్టే ఉన్న కోర్టు ఆర్డర్ కాపీని అందజేయడంతో పనులు నిలిపివేసి వెళ్లిపోయాడు. హై కోర్టులో స్టే ఉన్న విషయం తనకు తెలియకుండా దాచిపెట్టిన అధికారులపై హై కోర్టులో కేసు వేస్తానని గుత్తేదారు వివి కృష్ణయ్య పేర్కొన్నాడు. ఈ విషయమై  జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి ఎన్టీఆర్ కాలనీవాసులు నిజామాబాద్ వెళ్లారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన జిల్లా ఆర్టీసీ అధికారులను  సమాచారం ఇచ్చారు.

హైకోర్టు స్టే ఉండగా పనులు ఇలా చేపడతారని, తక్షణమే పనులను నిలిపివేయించాలని ఆదేశించినట్లు సమాచారం.  జిల్లా కలెక్టర్ ను మరో రెండు రోజుల్లో కలుస్తామని విజయ్ అగర్వాల్, ఎన్టీఆర్ కాలనీ అధ్యక్షుడు జాడే శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఆర్ఎం కార్యాలయంలో, ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో, మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు స్టేట్ కాపిని మరోసారి అందజేశారు. అధికారులను కలిసిన వారిలో ఎన్టీఆర్  కాలనీవాసులు లక్ష్మణ్, నరేష్, రామకృష్ణ, కిరణ్, నాతన్ పాల్ తదితరులు ఉన్నారు.