29 May, 2026 | 8:30 PM

రాజౌరీ అడవుల్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్

29-05-2026 11:28 AM

రాజౌరి : జమ్ముకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని(Rajouri) మంజకోట్ సెక్టార్ అటవీ ప్రాంతాల్లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF సంయుక్తంగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్(Anti terror operation ) శుక్రవారం నాటికి ఏడవ రోజులోకి ప్రవేశించిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిఘా సమాచారం మేరకు డోరిమల్-గంభీర్ మొగ్లా అటవీ ప్రాంతంలో(Dorimal-Gambhir Mogla Forest Area) గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు పారిపోకుండా నిరోధించేందుకు, దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ గట్టి నిఘా వలయం ఏర్పాటు చేసి భద్రతా దళాలు ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై మల్టిపుల్ గ్రెనేడ్ లాంచర్లతో(Multiple Grenade Launchers) బలగాలు దాడి చేస్తున్నాయి. అడవి లోపలి భాగం నుంచి భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.

ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో గురువారం నాడు డోరిమల్ ప్రాంతంలో భారీగా కాల్పులు, షెల్లింగ్ జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌ను మరింత పటిష్టం చేసేందుకు అదనపు బలగాలను, లాజిస్టికల్ మద్దతును ఆ ప్రాంతానికి హుటాహుటిన తరలించారు. అదే సమయంలో, అటవీ ప్రాంతపు లోపలి భాగాల్లో నిఘా, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దుర్గమ ప్రాంతాల్లో భద్రతా దళాలు(Security Forces) విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నాయని, అనుమానిత రహస్య స్థావరాల చుట్టూ కట్టుదిట్టమైన పహారాను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల గురించి అందిన నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు, ఈ వారం ప్రారంభంలో సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు(Jammu and Kashmir Police) సంయుక్తంగా “ఆపరేషన్ షేరువాలి”(Opertaion Sheruwali) అనే సంకేతనామంతో ఈ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఉగ్రవాదుల గాలింపు కోసం అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లు, స్నిఫర్ డాగ్ లను రంగంలోకి దింపారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.