24 March, 2026 | 3:48 AM

అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

24-03-2026 12:45 AM

నూతనకల్, మార్చి 23: గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల పరిధిలోని బికుమల్ల గ్రామ సర్పంచ్ రామసహాయం మమత అనుప్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం  గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను తల్లిదండ్రులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందని,రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఆహారం ఎంతో దోహదపడుతుందన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, లబ్ధిదారులు కేంద్రాలకు వచ్చి సేవలను పొందాలని కోరారు.అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో ఓనమాలు దిద్దించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.