14 June, 2026 | 1:34 AM

ప్రభుత్వ బడిని శుభ్రం చేసిన బండి

14-06-2026 12:00 AM
  1. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం 
  2. పదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ, పరీక్ష ఫీజు చెల్లింపు
  3. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన స్ఫూర్తితో చేపట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్

సిరిసిల్ల/వేములవాడ, జూన్ 13 (విజయక్రాంతి): ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయంగా చీపురు పట్టి తరగతి గదులను శుభ్రం చేశారు.

పైపుతో నీళ్లు చల్లి, బెంచీలు, టేబుళ్లు, తరగతి గదుల మూల మూలలను శుభ్రం చేశారు. బండి సంజయ్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. అనేక చోట్ల కార్యకర్తలు సొంతంగా చీపుర్లు, బకెట్లు, క్లాత్‌దీతిజిజిలు తీసుకువచ్చి పాఠశాలలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. పదో తరగతి విద్యార్థులందరికీ ఈసారి కూడా తన వేతనం నుంచి పరీక్ష ఫీజు చెల్లిస్తానని, ఉచితంగా సైకిళ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను త్వరలో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. గ్రామాలు, మండలాల్లో విద్యార్థుల చేరికల కోసం త్వరలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎస్పీపై బండి సీరియస్

సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతేపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి| బాధ్యత’ అధికారిక కార్యక్రమానికి కేంద్ర మంత్రి హోదాలో హాజరు కాగా, ఎస్పీ గైర్హాజరు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో అధికారిక కార్యక్రమానికి వస్తే, జిల్లా ఎస్పీ హాజరుకాకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని బండి సంజయ్ అన్నారు.

ఎస్పీ ఎందుకు రాలేదంటూ వేదికపై ఉన్న డీఎస్పీని నేరుగా ప్రశ్నించారు. ‘నన్ను సాధారణ రాజకీయ కార్యకర్త అనుకుంటున్నారా? నేను కేంద్రమంత్రిని అనే గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీపై ఎస్పీకి అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలోనే చేరాలని, ప్రభుత్వ విధుల్లో ఇలాంటి నిర్లక్ష్యం తగదని ఘాటుగా హెచ్చరించారు.