ప్రథమార్ధం ప్లాపులమయం!
- సంక్రాంతి సీజన్‌లోనే జోష్.. వేసవి అంతా నిరాశే
- తొలి అర్ధ వత్సరం గుణపాఠాలే ఎక్కువ!
- సెకండ్ హాఫ్‌పైనే నిర్మాతల ఆశలు
- టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇదీ
2026 మొదటి ఐదు నెలల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ తీవ్ర నిరాశకు గురిచేసింది. సంక్రాంతి మినహా వేసవి సీజన్ మొత్తం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో టాలీవుడ్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. మొత్తంగా ఈ ప్రథమార్ధంలో యాక్షన్ డ్రామా, కమర్షియల్ ఎంటర్‌టైనర్, హారర్ కామెడీ జానర్ సినిమాలు ప్రేక్షకులను అత్యధికంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆర్నెల్ల కాలంలో సుమారు 54 సినిమాలు విడుదలవగా, కొన్ని భారీ ప్రాజెక్టులు సైతం సగటు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాయి. కేవలం వీఎఫ్‌ఎక్స్, లార్జర్-ద్యాన్-లైఫ్ ఎలిమెంట్స్‌ను నమ్ముకుంటే సరిపోదని, కథలో బలమైన ఎమోషన్ ఉండాలన్న గట్టి గుణపాఠాన్ని కొన్ని సినిమాల ఫలితాలు టాలీవుడ్ మేకర్స్‌కు నేర్పాయి.
ఈ ఏడాది ఆరంభం టాలీవుడ్‌కు శుభారంభం పలికింది. తెలుగు పరిశ్రమలో సంక్రాంతి సీజన్ అదిరిపోయే ఫలితాలు నమోదయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ క్లీన్ హిట్‌గా నిలిచి ప్రేక్షకులను నవ్వించింది. శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా హిట్ టాక్‌తో పండుగ బొమ్మగా ప్రశంసలందుకుంది.
అయితే, ఆ తర్వాత వచ్చిన సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలావుంటే, ఇటీవల థియే టర్లలో అడుగుపెట్టిన ‘పెద్ది’ సంచనల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఒకవిధంగా బాక్సాఫీస్ ఆకలి తీర్చింది. మే నెల వరకు నీరసించిన బాక్సాఫీస్‌కు జూన్ 4న విడుదలైన రామ్‌చరణ్ ‘పెద్ది’ కొంతమేర ఆకలి తీర్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ రామ్‌చరణ్ పర్ఫార్మెన్స్ కారణంగా సరికొత్త రికార్డులతో పరిశ్రమకు భారీ ఊపునిచ్చింది. ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి, ప్రస్తుతం థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
పెద్ద చిత్రాల నిరాశ..
భారీ అంచనాలతో వచ్చి న స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. భారీ అంచనాలతో ఉగాది కానుక గా వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మిశ్రమ స్పం దన తెచ్చుకుని కమర్షియల్‌గా వెనుకబడింది. భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ నిర్మించిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఈ ఫస్ట్ హాఫ్‌లో అతిపెద్ద కేస్ స్టడీగా మారింది. ప్రభాస్ క్రేజ్ వల్ల ‘ది రాజా సాబ్’ ఓపెనింగ్స్ అదిరిపోయినప్పటికీ కంటెంట్‌లో బలం లేకపోవడంతో ఆశించిన స్థాయి మెగా సక్సెస్ అందుకోలేక అండర్ పెర్ఫార్మర్‌గా మిగిలిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 208 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా.. స్టార్ డమ్ మాత్రమే సరిపోదనే గుణపాఠం నేర్పాడు! కేవలం వీఎఫ్‌ఎక్స్, లార్జర్-ద్యాన్-లైఫ్ ఎలిమెంట్స్ నమ్ముకుంటే సరిపోదన్న విషయం టాలీవుడ్ మేకర్స్‌కు మరోమారు తెలిసివచ్చింది. భారీ స్టార్ కాస్ట్, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ఉన్నా.. కథలో దమ్ము లేకపోతే ప్రేక్షకులు ఎంతటి పెద్ద సినిమానైనా నిర్మొహమాటంగా తిరస్కరిస్తారనే చేదు నిజం పెద్ద సినిమాల ఫలితాలతో టాలీవుడ్‌కు మరోసారి అర్థమైంది.
పాత కథలనే కొత్త ప్యాకేజీలతో తీసుకురావడం వల్ల ప్రేక్షకులు ముఖం చాటేశారు. ఈ రొటీన్ ఫార్ములా పనిచేయకపోగా ఐపీఎల్, ఎండల ప్రభావమూ టాలీవుడ్ ఫలితాలను తారుమారు చేశాయి. ఒకవైపు ఐపీఎల్ క్రేజ్, మరోవైపు భానుడి భగభగలు తోడవడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కంటెంట్ లేని భారీ చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించగా, బలమైన కథాంశాలు ఉన్న చిన్న, మధ్య తరహా చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు.
ద్వితీయార్ధంపై భారీ ఆశలు
2026 మొదటి ఐదు నెలల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ గలగలలు వినిపించలేదు. ఒక్క సంక్రాంతి మినహా మిగిలిన సమ్మర్ సీజన్ నెమ్మదించింది. పెద్ద సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల వేసవి సీజన్ డల్‌గా సాగింది. అయితే, ఫస్ట్ హాఫ్ ఒడిదుడుకులను మర్చిపోయేలా రాబోయే ఆరు నెలల్లో టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్లులు లైన్‌లో ఉన్నాయి. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సమంత ప్రధాన పాత్రలో వస్తున్న ఉమెన్ -సెంట్రిక్ ఎమోషనల్ డ్రామా ‘మా ఇంటి బంగారం’పై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. అఖిల్ అక్కినేని సరికొత్త మేకోవర్‌తో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘లెనిన్’ కూడా మంచి అంచనాల నడుమ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ ఇచ్చిన ఊపుతో జూన్, జూలై నెలల్లో రాబోతున్న చిత్రాలపైనే పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. తొలి అర్ధభాగం నేర్పిన గుణపాఠాలను దృష్టిలో పెట్టుకున్న టాలీవుడ్ నిర్మాతలు రాబోయే సెకండ్ హాఫ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.
అయితే, 2026 సెకండాఫ్‌లో రాబోయే రాబోయే పెద్ద, మిడ్-రేంజ్ సినిమాల భవితవ్యం పూర్తిగా ఫస్ట్ హాఫ్ నేర్పిన పాఠాలపైనే ఆధారపడి ఉంటుం ది. రాబోయే స్టార్ హీరోల చిత్రాలు కేవలం యాక్షన్, ఎలివేషన్లకే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ‘ది రాజా సాబ్’ ఫలితం పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కథనం, భావోద్వేగాల చుట్టూ తిరిగే చిత్రాలకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమైంది కాబట్టి, రాబోయే సెకండాఫ్‌లో రాబోయే సినిమా లు టాలీవుడ్ రేంజ్‌ను మరింత పెంచుతాయని ఆశిద్దాం!






