13 June, 2026 | 11:33 PM

రంగాపురం వాసికి గిన్నిస్ బుక్ లో చోటు

13-06-2026 09:53 PM

* అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత ప్రతిభను చాటిన సైదులు

గరిడేపల్లి,(విజయక్రాంతి): అదొక మారుమూల గ్రామం.... కుటుంబ నేపథ్యం కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబం...ఆ మారుమూల గ్రామంలో ఐదవ తరగతి వరకు చదివి అనంతరం సూర్యాపేట పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న ఒక యువకుడు సాధించిన ఘనత ఇది నిరుపేద కుటుంబంలో పుట్టి తన ఇష్టమైన మ్యూజిక్ కీబోర్డు ప్లే లో ప్రతిభను చాటి నేడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించి ఆ గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి ఆదర్శంగా ఆ యువకుడు నిలిచాడు.

గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నకిరేకంటి సైదులు (హబెలు) అనే యువకుడు కీబోర్డ్ సంగీత పోటీలలో గిన్నిస్ బుక్ అవార్డు గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే,ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో కీబోర్డు సంగీత పోటీలను నిర్వహించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించగా, 22 దేశాల నుంచి వేలమంది కీబోర్డ్ సంగీతకారులు ఆగకుండా గంటసేపు వాయిస్తూ పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 777 మందిని గిన్నిస్ వరల్డ్ రికార్డుల కోసం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారిలో గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన నకరికంటి సైదులు ఉండటం విశేషం.

కేవలం పదవ తరగతి మాత్రమే చదివి అనంతరం కీబోర్డు పట్ల ఆసక్తితో విజయవాడకు వెళ్లి అక్కడ హల్లెల్ మ్యూజిక్ సంస్థలో ఉచితంగా కీబోర్డ్ ప్లే నేర్చుకున్నాడు. మొదటినుంచి కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే సైదులు కుటుంబం ప్రస్తుతం తండ్రి పాస్టర్ గా పనిచేస్తుండగా, సైదులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో ఒక పెట్రోల్ బంకులు మేనేజర్ గా ప్రస్తుతం పని చేస్తున్నట్లు తెలిపారు. రంగాపురం గ్రామానికి చెందిన నకరికంటి వెంకన్న, నాగమ్మ ల పెద్ద కుమారుడు నగరికంటి సైదులు (హేబెలు) ఉత్తమ ప్రతిభను చాటి అంతర్జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు తేవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. హల్లెల్ మ్యూజిక్ వ్యవస్థాపకులు  అగస్టిన్ దండింగి గిన్నిస్ సర్టిఫికెట్ అందించి అభినందించారు. ప్రతిభ చాటిన సైదులు కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు ప్రత్యేక అభినందించారు.