2 June, 2026 | 3:47 AM

తెలంగాణ గడ్డపై మళ్లీ ఆంధ్ర పెత్తనం!

02-06-2026 02:54 AM

పవన్ కల్యాణ్ పార్టీ సభపై రాజకీయ దుమారం 

రాజకీయ అవసరం కోసమే జనసేన సభ అంటున్న తెలంగాణవాదులు

  1. మళ్లీ తెరపైకి ఆత్మగౌరవ అంశం 
  2. కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా అనే ప్రశ్నలు

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి) : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్లు గడిచినా తెలంగాణపై ఇంకా ‘ఆంధ్ర పెత్తనం’ నడుస్తోందనే అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలం గాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్‌లో ‘తెలంగాణ నవ నిర్మా ణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ పేరిట సభ నిర్వహిస్తుండటం తెలంగాణలో పెద్ద రాజకీయ దుమారానికి కేంద్ర బిందువైంది.

దీని వెనుక అస లు రాజకీయ సందేశం ఏమిటి?, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పా టును వ్యతిరేకించిన వారిగా విమర్శలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఒకవైపు ప్రొఫెసర్ నాగేశ్వ ర్ వ్యవహారం, మరోవైపు అమీర్‌పేట్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం, ట్యాంక్‌బండ్‌పై ఆంధ్ర నాయకుల విగ్రహాల చుట్టూ నడుస్తున్న వివాదాలు, ఇంకోవైపు తెలంగాణలో మళ్లీ పాగావేయాలనే ఏపీ రాజకీయ పార్టీల ప్రయత్నాలు కలిసి రాష్ట్రంలో ప్రాంతీయ భావోద్వేగాలను మళ్లీ రగిలిస్తున్నాయి.

తెలంగాణ కోసం జరిగిన పోరాటం కేవలం భౌగోళిక రాష్ట్రం కోసం కాదు.. రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన ఆత్మగౌరవ ఉద్యమం అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మరోసారి ‘తెలంగాణ అస్తిత్వం వర్సెస్ ఆంధ్ర పెత్తనం’ అనే చర్చ వైపు మళ్లిస్తున్నాయి. 

పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు తెలంగాణ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీశాయి. అయితే వాటిలో కొన్ని రాష్ట్ర విభజన ప్రక్రియపై, మరికొన్ని తెలంగాణ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలుగా ఉన్నాయి. 

* తెలంగాణ ఏర్పడిన సందర్భంలో 11 రోజులు అన్నం తినలేదని ఆయన బహిరంగం గానే చెప్పారు.

* 2014లో జనసేన ఆవిర్భావ సమయం లో పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు.. విభజన విధానాన్నే వ్యతిరేకించాను’ అంటూ పార్లమెంట్‌లో జరిగిన విధానం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. 

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయం లో సీమాంధ్ర ప్రజల ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘తెలంగాణ ఇచ్చిన తీరు బాధ కలిగించింది’ అంటూ రాష్ట్ర విభజనను కేంద్రం నిర్వహించిన విధానంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

* 2016 మధ్య పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేశారు. కుటుంబ పాలన, అవినీతి, నిరుద్యోగ సమస్యలు, రైతుల ఇబ్బందులపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి బీఆర్‌ఎస్ నేతలు ‘తెలంగాణ ప్రజల తీర్పును అవమానించడం‘గా కౌంటర్ ఇచ్చారు.

* కొన్ని సందర్భాల్లో తెలంగాణ భావోద్వేగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విమర్శలకు దారితీశాయి.

* తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని ఆక్రోశం వెళ్లగక్కారు.

ఇప్పుడు మరో మాట?..  

గతంలో తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్ప ద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్,   ప్రస్తుతం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ‘ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు తెలంగాణ గడ్డపై సభ నిర్వహించడాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కుల విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ గుర్తుకొచ్చిందా? అని నిలదీస్తున్నారు.

రాష్ట్ర విభజన విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు తెలంగాణ ఏర్పాటుపై విమర్శనాత్మకంగా మాట్లాడిన సందర్భాలను తెలంగాణలోని పార్టీలు గుర్తుచేస్తున్నాయి. అదే పవన్ ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సభ పెట్టడం రాజకీయ అవకాశవాదం కాదా? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ల తర్వాత రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రోజునే సభ నిర్వహించడం వెనుక రాజకీయ సందేశం ఏమిటన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల నిజమైన గౌరవం ఉంటే గత వ్యాఖ్యలపై పవన్ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

రాజకీయ అవసరం కోసమేనా?... 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడం, గత ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవడం వంటి అంశాలు జనసేన ముందున్న సవాళ్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం పవన్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఒకవైపు జనసేన శ్రేణులు ఈ సభను చారిత్రాత్మకంగా అభివర్ణిస్తుండగా, మరోవైపు ప్రత్యర్థి పార్టీలు మాత్రం ‘తెలంగాణ గుర్తొచ్చింది ఓట్ల కోసమే‘ అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ నవ నిర్మాణం గురించి మాట్లాడటం పవన్ కళ్యాణ్ రాజకీయ అవకాశవాదమని తెలంగాణ వాద, యువజన సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సభలో చేసే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో స్థానం సంపాదించాలని చూస్తుండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జనసేన తెలంగాణలో క్యాడర్ నిర్మాణం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటం వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరోవైపు ఆంధ్ర నాయకుల విగ్రహాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గానీ, ఏపీలోని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై తెలంగాణ వాదులు, జర్నలిస్టులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కేసులు పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ విశ్లేషకుడు ప్రొ. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన కార్యకర్తల దూకుడు, ఏపీ ప్రభుత్వం కేసు నమోదు వ్యవహారం తెలంగాణలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటన తెలంగాణ--ఆంధ్ర సంబంధాలపై కొత్త చర్చకు కారణమైందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రముఖుల విగ్రహాల అంశం కూడా మళ్లీ చర్చకు వచ్చింది. ఇటీవల కాలంలో సాహిత్య, కళా నిలయమైన రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయడంపైనే అనేక అభ్యంతరాలు వచ్చాయి. అక్కడితో ఆగకుండా తెలంగాణ ప్రజలకు ఆగ్రహం కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమీర్‌పేట్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం పెద్ద దుమారం రేపింది.

ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాజధాని మధ్యలో తెలంగాణ చరిత్ర, ఈ ప్రాంత మహనీయులు, కవులు, కళాకారుల కంటే ఆంధ్ర నేతల ప్రాధాన్యం ఎక్కు వగా కనిపిస్తోందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవానికి భం గం వాటిల్లుతున్న క్రమంలో ఇప్పుడు ఆంధ్ర నాయకులు వచ్చి తెలంగాణలో సభలు పెట్టడంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా తెలంగాణపై ఆంధ్ర పెత్తనం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎంతో ప్రాణ త్యాగం చేసి, పోరాడి తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పు డు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపాలని ప్రయత్నించడం ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.

పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం సభలు నిర్వహించడం, టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ కావాలని ప్రయత్నించడం, కొందరు ఏపీ నేతలు తెలంగాణ అంశాలపై వ్యాఖ్యలు చేయడం ప్రాంతీయ భావోద్వేగాలను మళ్లీ రగిలిస్తున్నాయని చెబుతున్నారు. 

తెలంగాణవాదులు పవన్‌ను అడుగుతున్న ప్రశ్నలు

* తెలంగాణ ఏర్పాటుపై గతంలో అభ్యంతరాలు చెప్పిన పవన్ ఇప్పుడు తెలంగాణ నవ నిర్మాణం గురించి ఎలా మాట్లాడతారు?

* తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై తన స్పష్టమైన వైఖరి ఏమిటి?

* గతంలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ లేదా వివరణ ఇస్తారా?

* తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడి రాజకీయ దిశను ఆంధ్ర నాయకులే నిర్ణయించాలా?

* తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభలు పెట్టడం వెనుక సందేశం ఏమిటి?

* తెలంగాణ చరిత్ర, ఉద్యమానికి తగిన గుర్తింపు ఇస్తున్నారా?

* రాష్ట్ర ఆత్మగౌరవంపై మళ్లీ రాజకీయాలు చేస్తున్నారా?

* తెలంగాణలో జనసేన రాజకీయ లక్ష్యం ఏమిటి?

* స్థానిక సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తారా?

* తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు రాష్ట్రం కోసం ఏం చేశారు?