10 August, 2026 | 7:05 PM

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి

10-08-2026 06:00 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి ముదిగొండ రాంబాబు,సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు దుబ్బ ధనలక్ష్మిలు పిలుపునిచ్చారు.

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కిసాన్ మోర్చా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,అఖిల భారత ఐక్య రైతు సంఘం, వ్యవసాయ కార్మిక, పివైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ములకలపల్లి ప్రధాన కూడలిలో భారీ రాస్తారో  నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వంశీకృష్ణ మాట్లాడారు.దేశంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కార్పొరేట్,బడా పారిశ్రామిక పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందన్నారు. ఎరువుల బుకింగ్ యాప్ ను తీసుకువచ్చి దేశ రైతాంగాన్ని ఇబ్బందులు,కష్టాల్లోకి నెడుతుందని విమర్శించారు. ఎరువుల బుకింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు పంటలు నష్టపోతున్నారని,విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.దేశ రైతాంగ సమస్యలను పరిష్కారించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు.అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.