వ్యాసాశ్రమంలో అవకతవకలపై విచారణ జరపాలి
శ్రీ వ్యాసాశ్రమ పరిరక్షణ తెలంగాణ కమిటీ డిమాండ్
ముషీరాబాద్,ఆగస్టు 5 (విజయక్రాంతి): తిరుపతి జిల్లా ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమంలో అవినీతి, అక్రమాలు, పరిపాలనా లోపాలు జరుగుతున్నాయని శ్రీ వ్యాసాశ్రమ పరిరక్షణ కమిటీ తెలంగాణ ఆరోపించింది. ఆశ్రమ వ్యవస్థాపకులు మహర్షి మలయాళ స్వాములు, అనంతరం విమలానందగిరి స్వాములు, విద్యానందగిరి స్వాముల హయాంలో సజావుగా నడిచిన బ్రహ్మవిద్యా పాఠశాల, బాలుర పాఠశాల, ఆసుపత్రి, వానప్రస్థ ఆశ్రయం, నిత్య అన్నదాన కార్యక్రమాలు ప్రస్తుతం నిలిచిపోయాయని కమిటీ పేర్కొంది.
ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర స్వామి, హైదరాబాద్ పీఠం అధ్యక్షుడు సంపూర్ణ నందగిరి స్వామి, పరమాత్మ నందగిరి స్వామి, సచ్చిదానందగిరి స్వామి, శంకర నందగిరి స్వామి, వెంకటాచరణం,
యోగేష్ స్వామిలు మాట్లాడుతూ ప్రస్తుత పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వాముల హయాంలో ఆశ్రమం పూర్వ వైభవాన్ని కోల్పోయిందని, బ్రహ్మవిద్యా పాఠశాల, బాలుర పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, ఆసుపత్రి, నిత్య అన్నదానం, వానప్రస్థ ఆశ్రయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అలాగే ఆశ్రమ నిర్వహణలో ఉన్న అమర్నాథ్ రెడ్డి, శివరామలను బాధ్యతల నుంచి తొలగించాలని,11 మంది సన్యాసులు, 11 మంది గృహస్తులతో కొత్త ట్రస్టు ఏర్పాటు చేసి ఆశ్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కోరింది. ఈ అంశాలపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.






