6 August, 2026 | 3:27 AM

ఇరుకు గదుల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు

06-08-2026 01:11 AM

పశు వైద్యశాలలోరెవెన్యూ కార్యాలయం

జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంపీడీవో కార్యాలయం

పట్టించుకోని జిల్లా అధికారులు

ఆళ్లపల్లి, ఆగస్టు 5, (విజయక్రాంతి): పరిపాలన సౌలభ్యం కోసం మండలాలను విభజించి కొత్త మండలాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు ఉధాసీన వైఖరిని అవలంబిస్తున్నాయి. అందుకు ఉమ్మడి గుండాల మండలం నుంచి విభజింపబడిన ఆళ్లపల్లి మండలమే చక్కని తార్కాణం. మండల పునర్విభజన జరిగి సంవత్సరాలు అయినా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం శోచనీయం.

రాష్ట్రంలో పాలన అంతా డిజిటల్ అయిపోయిందని, ప్రజల ముందుకే సేవలు వస్తున్నాయని పాలకులు చేస్తున్న గొప్పలు ఆళ్లపల్లి మండలంలో బట్టబయలవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్లపల్లి మండలంలో ప్రభుత్వ పాలన తీరు అగమ్యగోచరంగా తయారైంది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలవాల్సిన మండల కేంద్రంలో.. కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కూడా లేకపోవడం అధికారుల పనితీరుకు, ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పశువైద్య కార్యాలయంలో రెవెన్యూ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో కార్యాలయం కొనసాగటం అందుకు చక్కని ఉదాహరణ.

అరకొర వసతులు.. అస్తవ్యస్తంగా పాలన!

మండలంలోని కీలకమైన పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు దయనీయమైన పరిస్థితుల్లో, శిథిలావస్థకు చేరిన ఇరుకు గదుల్లోనే కొనసాగుతున్నాయి. నాలుగు గోడల మధ్య, ఇరుకైన గదులలో సాగుతున్న ఈ పాలన చూస్తుంటే.. ప్రభుత్వ లక్ష్యాలు ఏ స్థాయిలో నీరుగారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. క్షేత్రస్థాయిలో ఆ కార్యాలయాలు నడవడానికి ఇరుకు గదులే దిక్కవడం సిగ్గుచేటు.

 అధికారుల ఉదాసీనత!

శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ భవన సముదాయాలను నిర్మించాలన్న కనీస ఆలోచన కూడా అధికారులకు రాకపోవడం గమనార్హం.. అసలు ఈ మారుమూల ప్రాంతాలపై కలెక్టర్ నుండి మొదలుకొని స్థానిక అధికారులకు పర్యవేక్షణ లేదా? లేక గిరిజనులంటే అంత చులకనా? అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నరకం చూస్తున్న సామాన్య ప్రజలు, గిరిజనులు

పథకాల దరఖాస్తుల కోసమో, ధృవీకరణ పత్రాల కోసమో నిత్యం సుదూర గ్రామాల నుండి వచ్చే అమాయక గిరిజనులు ఈ అద్దె కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. కూర్చోడానికి సరిపడా కనీస బెంచీలు లేక, త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కరువై ఎండనకా, వాననకా కార్యాలయాల బయట చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక అత్యంత గోప్యంగా ఉండాల్సిన కీలకమైన ప్రభుత్వ రికార్డులు అద్దె గదుల్లోని తేమకు, వర్షపు నీటికి పాడైపోతుంటే.. అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విచారకరం.

ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా?

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ,సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి, ఆళ్లపల్లి మండలంలో పర్యటించాలి. ఇరుకు గదుల్లో  కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల దుస్థితిపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే అన్ని శాఖలకు కలిపి ఒకేచోట శాశ్వత ప్రాతిపదికన ’సమగ్ర మండల భవన సముదాయాన్ని’  నిర్మించాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  లేని పక్షాన ఆళ్లపల్లిలో అధికారుల తీరుకు వ్యతిరేకంగా ప్రజా ఆగ్రహం చుట్టుముట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.