6 August, 2026 | 2:33 AM

ఆపదలో ప్రాణాలను కాపాడేది రక్తదానమే

06-08-2026 01:14 AM

ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు టౌన్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రక్తదానం మానవత్వానికి ప్రతీక అని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రక్తదానం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని, పైగా కొత్త రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రమాదాలు, ప్రసవాలు, అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో రక్తం కోసం ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి సమయంలో స్వచ్ఛంద రక్తదాతలే ప్రాణదాతలుగా నిలుస్తారని పేర్కొన్నారు.

ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడే అవకాశముందని, యువత సంవత్సరానికి కనీసం రెండుసార్లు రక్తదానం చేసే అలవాటు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే, అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ తాటిపాముల సురేష్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పెండేల రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ళ సూర్యం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.