4 April, 2026 | 1:44 AM

నాటి అటెండరే.. నేటి ఉన్నతాధికారి

04-04-2026 12:10 AM

ఆదర్శం నడిగూడెం తాసిల్దార్ సూరయ్య ఉద్యోగ ప్రస్థానం

యువత ఆయనను అనుసరించాలంటున్న స్థానికులు 

కోదాడ (నడిగూడెం) ఏప్రిల్ 3 : మనలో చాలా మంది ఏదైనా ఒక ఉద్యోగం రాగానే తృప్తి చెంది, దానితో జీవితం కొనసాగిస్తారు. కానీ సోమపంగు సూరయ్య ప్రస్థానం అందుకు పూర్తి భిన్నం. ఎందుకుంటే ఒకప్పుడు అదే కార్యాలయంలో అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. నేడు అదే కార్యాలయంలో  ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని నిరూపించారు. 30 ఏళ్ల క్రితం అటెండర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన చోటే కార్యాలయానికి బాసుగా నియమితులై ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

తొలుత అటెండర్ గా బాధ్యతలు చేపట్టి అంతటితో ఆగకుండా  పట్టుదలతో విద్యా అర్హతలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. నేడు అదే కార్యాలయంలో తాహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. అటెండర్ గా మొదలై : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన సోమపొంగు భద్రయ్యకు ఏడుగురు సంతానంలో సూరయ్య మూడో వ్యక్తి.  1995 సంవత్సరంలో నడిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసిన సోమపొంగు భద్రయ్య అనారోగ్య కారణాలతో వలంటరి రిటైర్మెంట్ పొందారు. కారుణ్య నియామకంలో తండ్రి ఉద్యోగాన్ని సూరయ్య పొంది  1995 జూన్ 26 నుంచి 2000 సంవత్సరం వరకు కొనసాగారు.

2000 నుంచి 2002 వరకు మునగాల మండల ఎమ్మార్వో ఆఫీస్ లో అటెండర్ గా, అక్కడినుంచి తిరిగి నడిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో 2006 వరకు పనిచేశారు. పదోన్నతితో  అంచలంచెలుగా ఎదుగుతూ : 2006లో పదోన్నతి పొంది మఠంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరారు. రెండు సంవత్సరాలు పనిచేసిన అనంతరం 2008 లో నడిగూడెం కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్ గా బదిలీపై వచ్చారు. 2010లో ఉమ్మడి మేళ్ల చెరువు మండలానికి ఆర్ ఐ గా ప్రమోషన్ పై వెళ్లారు. 2012లో మట్టంపల్లి ఆర్‌ఐగా 2013లో నడిగూడెం ఆర్ ఐగా  పని చేశారు. అదేవిధంగా 2014, 15, 16 మండలంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేశారు.

2017 సెప్టెంబర్ లో మఠంపల్లి డిప్యూటీ తహశీల్దార్ గా ఉద్యోగన్నతి పొంది బదిలీ అయ్యారు. 2018 కోదాడ మండల ఎలక్షన్ డ్యూటీ గా, రెగ్యులర్ డీటీగా రెండు సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన 2021 లో చింతలపాలెం లో 11 నెలల పాటు ఇన్చార్జి తహశీల్దార్ గా విధులు నిర్వహించారు. 2022-  24 మూడు సంవత్సరాల పాటు మోతే మండల డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేసి 2024 జూలైలో మరల కోదాడ తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. అక్కడినుంచి 2026 జనవరి 8న చింతలపాలెం మండల ఎఫ్‌ఏసి తహశీల్దార్ గా పనిచేశారు.                    

అటెండర్ అయిన చోటే తాసిల్దారుగా : తాజాగా మార్చి 31న నడిగూడెం మండల ఎఫ్‌ఎసి తహశీల్దార్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇదే కార్యాలయంలో 30 ఏళ్ల క్రితం అటెండర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించామని తిరిగి ఈ కార్యాలయానికి తహశీల్దార్ గా రావడం చాలా ఆనందంగా ఉందని సూరయ్య తెలిపారు.    అటెండర్ గా పనిచేసిన కార్యాలయంలో ఒక్కరోజైనా తహశీల్దారుగా పనిచేయాలని తన జీవిత లక్ష్యం నెరవేర్చినందుకు జిల్లా కలెక్టర్  తేజస్ నందులాల్ పవార్ కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.