15 April, 2026 | 2:36 AM

అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

15-04-2026 12:00 AM

- విద్యతోనే సామాజిక మార్పు

- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

కరీంనగర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం తెలిపారు.

మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సుడా చైర్మన్ కోమటీ రెడ్డి నరేందర్ రెడ్డి, ఉన్నత అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నతనం నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని.. ఖండాలు, సముద్రాలు దాటి ఉన్నత విద్య అభ్యసించారని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే మేధావిగా పేరుగాంచారన్నారు. సుమారు 30 డిగ్రీలు పూర్తి చేసిన అంబేద్కర్.. నా సేవలు నా దేశానికే ఉపయోగపడాలనే ఉద్దేశంతో భారతదేశానికి వచ్చి సేవలందించారన్నారు. విదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి.. అన్ని వర్గాలకు మేలు చేసేలా భారతదేశ రాజ్యాంగం రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని వివరించారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. పిల్లలను కూడా అంబేద్కర్ మాదిరి ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో , మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, ఆర్డీవో మహేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.