అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్,(విజయక్రాంతి): అంటరానితనం, కులవివక్షకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబేడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… అంబేడ్కర్ గారు సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులు కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కులవివక్ష నిర్మూలన కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు.
సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ గారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తలసాని పేర్కొన్నారు. యువత అంబేడ్కర్ గారి ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.






