28 March, 2026 | 3:17 AM

నాడు సమితి వైభవం..

28-03-2026 01:22 AM

నేడు ‘ఫ్యూచర్’ గమ్యం

ఫోర్త్ సిటీతో మారనున్న ఆమనగల్లు దశ

ఆమనగల్లు, మార్చి27 (విజయక్రాంతి): ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలకు దిక్సూచిగా, పరిపాలనకు కేంద్ర బిందువుగా వెలిగిన ఆమనగల్లు గడ్డ, ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపడుతున్న ’ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ) ప్రాజెక్టుతో ఈ ప్రాంత ముఖచిత్రం సమూలంగా మారిపోనుంది. జైపాల్ రెడ్డి వంటి దిగ్గజాల రాజకీయ ప్రస్థానానికి వేదికైన ఈ నేల, ఇప్పుడు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు వేదికగా మారుతుండటంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ ఉద్ధండుల పురిటిగడ్డ

జైపాల్ రెడ్డి నుంచి మొదలు కొని భట్టు రుక్మారెడ్డి వరకు ఈ ప్రాంతం పై చెరగని ముద్ర వేశారు.1959లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఆమనగల్ బ్లాక్ సమితిగా అవతరించింది. ఆ రోజుల్లోనే ఈ ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది.కేంద్ర మాజీ మంత్రి, మేధావి సూదిని జైపాల్ రెడ్డి ఇక్కడి నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ స్థాయికి ఎదిగారు. ఆమనగల్లు సమితి అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన భట్టు రుక్మారెడ్డి ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు గట్టి పునాదులు వేశారు. అప్పట్లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఆమనగల్లు ఒక ప్రధాన వాణిజ్య, పరిపాలన ’హబ్’గా విరాజిల్లిన తీరును నేటికీ పాత తరం వారు నెమరువేసుకుంటున్నారు.

ఆమనగల్లు ఏసీపీ క్లస్టర్గా..

2016 జిల్లాల విభజన తర్వాత అమనగల్లు కొంత ప్రాధాన్యత తగ్గినట్లు అనిపించినా, ఇప్పుడు ’ఫ్యూచర్ సిటీ’ రాకతో ఆమనగల్లు మళ్లీ వెలుగులోకి వచ్చింది.  ఇటీవల ప్రభుత్వం ఆమనగల్లును ఏసీపీ (ACP) కేంద్రంగా ప్రకటించడం ఇక్కడి పాలనలో మైలురాయిగా మారిందని చెప్పవచ్చు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల ప్రాంతాలు ఈ క్లస్టర్ పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల శాంతిభద్రతలు మెరుగుపడటమే కాకుండా, భారీ పెట్టుబడులకు భరోసా లభిస్తుంది.

ఫ్యూచర్ సిటీతో మారనున్న రూపు రేఖలు..

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఆమనగల్లు కేవలం పోలీస్ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఒక పరిపాలన కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అసెంబ్లీ పునర్విజన్లో భాగంగా ఆమనగల్లు నియోజకవర్గం కేంద్రంగా మారనుంది. దానిలో భాగంగానే ఇప్పటికే కోర్టు ఏర్పాటు అయ్యింది. త్వరలోనే ఆర్డీఓ (RౄO), ఆర్టీఓ (RTO) కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రేషన్కార్యాలయం ఏర్పాటు కానుంది. యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అత్యాధునిక స్కిల్ సెంటర్, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.ఫ్యూచర్ సిటీని అనుసంధానిస్తూ ఆరు లేన్ల హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు ఆమనగల్లు గుండా వెళ్లనున్నాయి.

ఆర్థిక పవర్ హౌస్గా ఆమనగల్లు

ఐటీ మరియు ఇండస్ట్రియల్ హబ్ల రాకతో ఈ ప్రాంతంలో భూముల విలువ అమాంతం పెరగనుంది. స్థానిక యువతకు ఐటీ, లాజిస్టిక్ మరియు తయారీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నాడు బట్టు రుక్మారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి మహామహులు వేసిన రాజకీయ పునాదుల మీద, నేడు ’ఫ్యూచర్ సిటీ’ అనే ఆధునిక ఆర్థిక సౌధం నిర్మితమవుతోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఆమనగల్లు ఇకపై ఒక’పవర్ హౌస్’గా మారుతుందనడంలో సందేహం లేదు.