8 May, 2026 | 7:16 AM

కల్వకుర్తి అభివృద్ధికి నిధులు కేటాయించండి

08-05-2026 12:00 AM

మంత్రులకు ఎమ్మెల్యే కసిరెడ్డి విజ్ఞప్తి

ఆమనగల్లు, మే 7 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మరియు పెండింగ్ పనుల పూర్తికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గురువారం హైదరాబాద్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీహరిల అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రధానంగా పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేటాయించాలని, అలాగే రెండో విడత కింద మరిన్ని ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

ఆమనగల్ పట్టణంలో ఏసీపీ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు, స్థలాలు కేటాయించాలని విన్నవించారు. నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గతంలో మంత్రులు నియోజకవర్గ పర్యటనలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.నియోజకవర్గ సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రులు, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని మరియు అభివృద్ధి పనులకు సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు ఏమ్మెల్యే పేర్కొన్నారు.