4న అఖిలపక్ష సమావేశం
- ఉద్యమకారుల కమిటీ సమావేశంలో నిర్ణయం
- కేశవరావు నేతృత్వంలో సచివాలయంలో కమిటీ భేటీ
- ఉద్యమకారుల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, క్షేత్రస్థాయి లో పోరాడిన ఉద్యమకారులకు సముచిత గౌరవం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు, మాజీ కే కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం సచివాలయంలో మొదటిసారిగా సమావేశమైంది.
కేకే అధ్యక్షతన కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ఎం.కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు.
జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు స్వీక రించాలని ఈ సందర్భంగా కమిటీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష కృషి చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం తరఫున తగిన గౌరవం, గుర్తింపు అందేలా సిఫార్సులు చేయాలని కమిటీ నిర్ణయించింది.
కార్యాచరణ రూపొందించండి
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారందరినీ గుర్తించి ప్రభు త్వం సముచితంగా గౌరవించాలనేది ప్రభుత్వ లక్ష్యమని కమిటీ చైర్మన్ కె.కేశవరావు తెలిపా రు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశలలో క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు సేకరిం చి పారదర్శకంగా అర్హుల జాబితా తయారీకి కార్యాచరణ రూపొందించాలని అధికారులను కేకే ఆదేశించారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రమాణాలు, జైలు శిక్షలు అనుభవించిన వారు, పలు పోలీస్ కేసుల నమోదు, ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, విద్యార్థులు, ఆర్టిసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, వారందరిని గుర్తించి, సముచితంగా గౌరవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని, ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి గౌరవించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్, జి.ఎ.డి కార్యదర్శి రఘునందన్ రావు, జి.ఎ.డి ప్రోటోకాల్ డైరెక్టర్ హరీష్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహా రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి పాపి రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.






