31 July, 2026 | 5:26 PM

వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

31-07-2026 04:41 PM

తాంసి/భీంపూర్: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో భీంపూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు రొడ్డ రాజు పొలిమేరలోని వరద కాలువ సమీపానికి బహిర్భూమికి వెళ్లగా, అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరగడంతో కాలువలో కొట్టుకుపోయాడు.

కాలువ మధ్యలో ఉన్న ఒక చెట్టును పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తూ అక్కడే చిక్కుకుపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భీంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై పీర్ సింగ్ సిబ్బందితో కలిసి వరద సహాయ పరికరాలతో సంఘటన స్థలానికి చేరుకుని వరద కాలువ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. కాలువ మధ్యలో చెట్టును పట్టుకుని ఉన్న రాజును గుర్తించి తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. రాజు ప్రాణాలు కాపాడిన ఎస్సై పీర్ సింగ్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.