31 July, 2026 | 5:40 PM

యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

31-07-2026 04:44 PM

ఆలేరు,(విజయక్రాంతి): విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రుచికరమైన పోషకాహారం, నాణ్యమైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని KGBV, పీఎం శ్రీ మోడల్ స్కూల్ & కాలేజీ, మండల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. KGBVలో విద్యార్థుల సంఖ్య, అడ్మిషన్లు, ఉపాధ్యాయుల హాజరుపై ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూమ్ పరిశీలించి పరిశుభ్రత, తాజా కూరగాయలు, ఆహార పదార్థాల గడువు తేదీలు చెక్ చేశారు.

మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. RBSK హెల్త్ చెకప్‌లు, రక్తహీనత విద్యార్థినుల వివరాలు అడిగి, ఐరన్ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. 14 ఏళ్ల లోపు బాలికలకు HPV వ్యాక్సిన్ 100% వేయించాలని DEOను ఆదేశించారు. అంగన్‌వాడీలో SAM, MAM పిల్లల వివరాలు, బాలామృతం ప్లస్, పాల ప్యాకెట్ల నాణ్యతను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రత, తాగునీరు, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO బిక్షపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.