ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
* సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి
* ఆకుతోటపల్లి జెడ్పీహెచ్‌ఎస్ 50 వసంతాల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ
ఆమన్‌గల్,(విజయక్రాంతి): "మన ఊరి బడిని మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులంతా తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలి" అని ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణలో (1976 - 2026) గోల్డెన్ జూబ్లీ (50 వసంతాల) ఆత్మీయ సమ్మేళనం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సభకు భారీగా తరలివచ్చారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి (MEO) పాండు, మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వారు సరస్వతీ దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు భిన్నంగా ప్రభుత్వ బడుల్లో అత్యంత ప్రతిభావంతులైన, ప్రభుత్వం ద్వారా ఎంపికైన సుశిక్షితులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, విద్యార్థుల శారీరక వికాసానికి అవసరమైన ఆటస్థలం వంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని తెలిపారు.
రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను, మధ్యాహ్న భోజన పథకాన్ని, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.50 ఏళ్ల పండుగ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఒకప్పుడు ఇక్కడే చదువుకుని, ప్రస్తుతం వివిధ రంగాలలో స్థిరపడిన పాత విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, గురువులతో ఉన్న అనుబంధాన్నినెమరువేసుకుంటూ ఆనందబాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పలువురు ప్రతిజ్ఞ చేశారు.






