9 April, 2026 | 3:39 PM

ఎయిడ్స్ పై అవగాహనతో వ్యాధి నిర్మూలన

09-04-2026 01:51 PM

గద్వాల : ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో గురువారం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కృష్ణవేణి చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో అతిధులు, వైద్యాధికారులు, నర్సింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులు ఎయిడ్స్ నిర్మూలనపై ముద్రించిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ కారణంగా సంక్రమించే ఒక వ్యాధి అని, ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, ఎయిడ్స్ వ్యాధి కలిగిన వ్యక్తికి చేసిన సూదులతోనే ఇతరులకు చేయడం, స్క్రీనింగ్ చేయని రక్త మార్పిడి, తదితర కారణాలతో ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందన్నారు.

తీవ్రమైన బరువు తగ్గుదల, చర్మంపై గాయాలు, దీర్ఘకాలిక విరేచనాలు, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే ఎయిడ్స్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏఆర్ టీ చికిత్స తీసుకుంటే వైరస్ నియంత్రించడంలో సహాయపడుతుందన్నారు. అలాగే సకారాత్మక జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు ఇందిర, ప్రోగ్రాం అధికారి రాజు, ఇతర వైద్యాధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.