18-02-2026 12:31:22 AM
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అధిష్టానం పిలుపు
ఢిల్లీకి రావాలని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ఫోన్
జగిత్యాల, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని ఢిల్లీ రావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.జగిత్యాలలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించేందుకు వెంటనే ఢిల్లీకి రావాలని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన జగిత్యాల నుంచి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
జగిత్యాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటినుంచి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు అన్యాయం జరుగుతున్నదని, కౌన్సిలర్ టికెట్ల విషయంలో కూడా న్యాయం జరగలేదని జీవన్ రెడ్డి మండిపడుతూ వస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇప్పించుకున్నారని జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.జగిత్యాల మున్సిపల్ లో 50 వార్డులుండగా జీవన్ రెడ్డికి కేవలం 15 స్థానాలు కేటాయించి, ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 35 సీట్లు ఇవ్వడం పట్ల జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు.
జీవన్ రెడ్డి 9 మంది కాంగ్రెస్ నుంచి మరో 9 మంది స్వతంత్రులను కౌన్సిలర్లుగా తన అనుచరులను కస్టపడి గెలిపించుకున్న చైర్మన్ పదవి ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వడంతో ఎమ్మెల్యేతో నాకు పార్టీలో ముప్పు తప్పదని, నాకు పార్టీలో 40 ఏళ్లకు పైగా పని చేస్తున్న ఎమ్మెల్యే చేరికతో నా కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతుందని ఇంకా ఎన్నేళ్లు భరిస్తూ ఉండాలని మరోసారి అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అధిష్టానం తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని పిలుపురావడంతో తాడో.. పేడో తెల్చుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమై ఢిల్లీకి వెళ్లడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తిని రెకెత్తిస్తోంది.