1 September, 2026 | 1:03 AM

సెప్టెంబర్ 2 నుంచి దశల వారీగా ఆందోళనలు

01-09-2026 12:29 AM
  1. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయాలి 
  2. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి
  3. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 

భూపాలపల్లి, ఆగస్టు 31 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల దగా పాలనపై సెప్టెంబర్ 2 నుంచి దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తెలిపారు. సోమవారం జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.

మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మికి తులం బంగారం, పెన్షన్ రూ.4 వేలకు పెంపు, రైతుబంధు రూ.15 వేలకు పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.