కల్తీ దందా
- పాడైపోయిన నూనెలు, పిండిని.. బ్రాండెడ్ పేర్లతో రీ-ప్యాకింగ్
- వట్టినాగులపల్లిలో శ్రీ జస్నాత్ ట్రేడర్స్‌పై మాదాపూర్ ఎస్వోటీ పోలీసుల మెరుపుదాడి
- రూ. 21.91 లక్షల విలువైన 5 వేల లీటర్ల నూనె, 5 వేల కిలోల గోధుమ పిండి సీజ్
- రాజస్థాన్‌కు చెందిన తండ్రీకొడుకుల అరెస్ట్
హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 9 (విజయక్రాంతి): సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అక్రమ సంపా దనే లక్ష్యంగా కల్తీ వ్యాపారం దందా చేస్తు న్న ఓ తండ్రీకొడుకుల బాగోతమిది. ప్రజ లు నిత్యం వినియోగించే వంట నూనె, గోధుమ పిండిని ఇష్టారాజ్యంగా కల్తీ చేస్తున్న ఆ తండ్రీకొడుకులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి భారీస్థాయిలో కల్తీ సరుకును, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. శేరిలిం గంపల్లి పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై ఎస్వోటీ పోలీసులు సోమవారం ఆకస్మికంగా దాడి చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భన్వర్ రామ్ జాట్ (46), అతని కుమారుడు అశోక్‌కుమార్ ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా కల్తీ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు.
మార్కెట్‌లో గడువు తీరిన వివిధ కంపెనీల వంట నూనెలను వీరు చౌకగా సేకరిస్తున్నారు. పాడైపోయిన ఆ నూనెను సోయా బీన్ నూనెతో కలిపి ప్రత్యేకంగా ఫిల్టర్ చేసి, మళ్లీ ప్రసిద్ధ బ్రాండ్ల పేర్లతో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. నూనెలతో పాటే నిత్యం ఇళ్లలో రోటీల కోసం వాడే గోధుమ పిండిని సైతం వీరు వదల్లేదు.
గడు వు ముగిసిన, పాడైపోయిన గోధుమ పిండిని వివిధ ప్రాంతాల నుంచి భారీగా సేకరించి జస్నాత్ గోల్ చక్కి అట్టా అనే కొత్త పేరుతో రీ-ప్యాకింగ్ చేసి అమాయక జనాలకు అంటగడుతున్నట్లు పోలీసుల దాడుల్లో వెలుగుచూ సింది. ఎస్వోటీ పోలీసులు జరిపిన ఈ మెరుపుదాడిలో కళ్లు చెదిరే స్థాయిలో కల్తీ సరుకు పట్టుబడింది. సుమారు రూ. 10.55 లక్షల విలువైన 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, రూ. 3.11 లక్షల విలువైన 5,192 కిలోల కల్తీ గోధుమ పిండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు కల్తీకి ఉపయోగిస్తున్న ఆయిల్ ఫిల్టర్ మెషిన్, గోధుమ ఫిల్టర్ మెషిన్, ప్యాకింగ్ మెషిన్లు, వేయింగ్ మెషిన్లతో పాటు సరుకు రవాణాకు వాడే ఒక టెంపో ట్రాలీని సైతం పోలీసులు సీజ్ చేశారు. ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ కల్తీ నూనె, గోధుమ పిండి, యంత్రాలు, వాహనం మొత్తం విలువ సుమారు రూ. 21,91,980 ఉంటుందని అంచనా వేశారు.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న నిందితులు భన్వర్ రామ్ జాట్, అశోక్ కుమార్‌లను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. ఈ కల్తీ ముఠాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.




