8 నుంచి జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు
- జూన్ 1 నుంచి తరగతులు
- ఒక్కోసెక్షన్‌లో గరిష్ఠంగా 88 మంది విద్యార్థులకే అనుమతి
- గుర్తింపు పొందిన కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలి
- అడ్మిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్‌ను తెలంగా ణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో తొలి విడత అడ్మిషన్లు ఈ నెల 8 నుంచి చేపట్టనున్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ 31 కాగా, మొదటి విడత అడ్మిషన్ల గడువు ముగింపు జూన్ 30తో ముగుస్తుంది.
ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘యాంటీ అఫిడవిట్’ను సమర్పించాల్సి ఉంటుం ది. ఎప్పటిలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేశాల్లో రిజర్వేషన్లు పాటించాలని ఈ మేరకు ప్రిన్సిపాల్స్‌కు బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం సీట్లు కేటాయిం చారు. ప్రత్యేక కళాశాలలు లేనిచోట బాలికల కోసం 33.33 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని, సీట్ల వివరాలు ప్రతిరోజూ నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని ఆదేశించారు.
విద్యార్థులు బోర్డు గుర్తింపు పొందిన అఫిలియేటెడ్ కాలేజీల్లోనే చేరాలని, ఆ జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో ఉందన్నారు. ఒక్కోసెక్షన్‌లో గరిష్ఠంగా 88 మంది విద్యార్థులకే అనుమతినిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.






