5 June, 2026 | 12:21 AM

కేంద్ర కేబినెట్‌లో అదిలాబాద్ ఎంపీ జి. నగేష్ కు చోటు?

04-06-2026 10:14 AM

బోథ్,జూన్ 4(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు జి నగేష్(Adilabad MP G Nagesh) కు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆదివాసి నాయకుడు రాజకీయ వివాదా రహితుడు అయినా ఈయనకు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు కేంద్రంలోని పెద్దలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

పూర్తి సమాచారం సేకరణ.

ప్రధానమంత్రి కార్యాలయం వారు గత పది రోజుల క్రితం ఎంపీ కి సంబంధించిన పూర్తి బయోడేటా సేకరించినట్లు తెలిసింది. ఆయనకున్న రాజకీయ అనుభవం చేపట్టిన పదవులను అడిగి సేకరించినట్లు సమాచారం. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారి మంత్రి పదవిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ వికలాంగుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గ్రూపు విభేదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయే మనస్తత్వం ఉన్న ఈయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఏకైక ఆదివాసి ఎంపీ... 

దక్షిణ భారతదేశంలో ఆదిలాబాద్ జిల్లా ఎంపీ ఏకైక ఆదివాసి కావడం తోపాటు గిరిజన సమస్యల పైన పట్టు ఉన్న నగేష్ కు కేంద్రమంత్రి బాధ్యతలు కట్టబెడితే ఆదివాసీలకు గిరిజనులకు న్యాయం చేసినట్లు ఉంటుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కేరళ పంజాబ్ రాష్ట్రాలలో  గిరిజన చట్టాలపై జరిగిన సమీక్షలు ఎంపీ పాల్గొనడం జరిగింది. రాజకీయంగా వివాదాలకు దూరంగా ఉంటూ ఆయన అనుచర వర్గాన్ని పది లంగా ఉంచుకున్న ఈయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి గతంలో కేంద్ర మంత్రిగా అప్పటి ఎంపీ వేణుగోపాల చారి కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం జరిగింది. నగేష్ కు స్థానం కల్పిస్తే పార్టీ మరింత బలపడే ఆస్కారం ఉందని పరిశీలకులు అంటున్నారు