13 August, 2026 | 9:41 PM

వెదురు సాగుతో రైతులకు అదనపు ఆదాయం

13-08-2026 08:54 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్ పలిమెల మండలాల్లో పర్యటన

పలిమెల,(విజయక్రాంతి): రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు వెదురు సాగు చేపట్టి అదనపు ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని వెదురు నర్సరీని పరిశీలించిన ఆయన, జిల్లాలో ఆరు మండలాల్లో సుమారు 70 వేల వెదురు మొక్కలు రైతులకు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 1,200 మంది రైతులను గుర్తించామని, ఒక్కో రైతుకు 60 మొక్కలను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. వెదురు సాగు నిర్వహణకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

అనంతరం పలిమెల మండలంలో పర్యటించిన కలెక్టర్ ఫామ్‌పాండ్‌లు, కేజీబీవీ, మహిళా సంఘాల ఉపాధి కార్యక్రమాలు, నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇంటర్మీడియట్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. జిల్లాలో మంజూరైన 214 ఫామ్‌పాండ్‌లలో 157 పూర్తయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలను విస్తరించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, తహసీల్దార్ రాజేశ్వరరావు, డీపీఎం రవి, పీఎంకేఎస్‌వై ప్రాజెక్టు అధికారి సతీష్ రెడ్డి, కేజీబీవీ ఎస్‌ఓ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.