ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ ఎం. డెవిడ్ ఆదేశం
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డెవిడ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో లోకేశ్వర్ రావుతో అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతతో పని చేయాలని తెలిపారు.
ప్రజావాణికి వచ్చిన ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అర్జిదారుల నుంచి వివిధ సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన బేతి సునంద తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని వినతి సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం చోర్‌పల్లి గ్రామానికి చెందిన కొమ్ము విజయ తన భర్త మరణించడంతో వితంతువు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన కమిటే శంకర్ తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జాదవ్ రోహిదాస్ తన వ్యవసాయ భూమి ఓపెన్‌కాస్ట్ గనుల కారణంగా ముంపుకు గురవుతున్నందున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తిర్యాని మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన లింగం పెళ్లి చిన్నమ్మ తన పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మన్నెంపల్లి అరుణకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి సమర్పించారు. కౌటాల మండలం గురుడుపేట గ్రామానికి చెందిన చల్ల లక్ష్మి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




