మంథని డివిజన్ ఎరువుల డీలర్లకు ఏడీఏ అంజనీ మిశ్రా హెచ్చరిక
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు
- నిషేధిత ‘పారాక్వాట్’ అమ్మకాలపై ఉక్కుపాదం
- మంథని లో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
మంథని, జూలై 17 (విజయ క్రాంతి)వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను దోపిడీ చేయాలని చూస్తే సహించేది లేదని మంథని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అంజనీ మిశ్రా ఎరువుల డీలర్లను తీవ్రంగా హెచ్చరించారు. మంథని డివిజన్ పరిధిలోని ఎరువుల, పురుగుమందుల డీలర్లతో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఆదేశాలు జారీ చేశారు.
అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఏడీఏ అంజనీ మిశ్రా మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో డీలర్లు మానవత్వంతో వ్యవహరించాలే తప్ప, ఎరువులను నిర్ణీత ధరల కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన ధరలకే ఎరువులు, విత్తనాలు విక్రయించాలి. ప్రతి డీలర్ ధరల పట్టికను విధిగా ప్రదర్శించాలి.
పారాక్వాట్’ విక్రయిస్తే జైలుకే
ప్రభుత్వం పారాక్వాట్ పురుగుమందును పూర్తిగా నిషేధించిందని ఏడీఏ గుర్తుచేశారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా నిషేధిత పారాక్వాట్ విక్రయాలు జరిపినట్లు తెలిస్తే సదరు డీలర్ల లైసెన్సులను రద్దు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు.
డివిజన్ అధికారులకు డీలర్లకు ఏడీఏ జారీ చేసిన కీలక ఆదేశాలు
ప్రస్తుతం వరి విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, ఆరుతడి పంటల లభ్యత, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు అవసర మైన పెసర, కంది, మినుములు వంటి ఆరుతడి పంటల విత్తనాలను డీలర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని,
సాగు మార్పుపై అవగాహన కల్పించాలని, వర్షాభావం ఎక్కువగా ఉన్నందున రైతులు వరికి బదులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారులు బి. రామకృష్ణ (కమాన్పూర్), కె. శ్రీకాంత్ (రామగిరి), డాక్టర్ డి. నవ్య (మంథని) లతో పాటు మంథని డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






