19 August, 2026 | 12:06 PM

మనోహరాబాద్‌లో రెవెన్యూ అవినీతి లీల‌లు !?

19-08-2026 09:05 AM

ఫోర్జ‌రీ చేసి రిజిస్ట్రేష‌న్ చేశార‌ని బాధితుల ఆరోప‌ణ‌

పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నం

గుండెపోటుకు గురైన మ‌రో బాధితుడు

కోర్టులో స్టెట‌స్ కో ఉండ‌గా రిజిస్ట్రేష‌న్‌

మనోహరబాద్(తూప్రాన్‌): కోర్టు స్టేట‌స్ కో కేసులో ఉన్న వివాదాస్ప‌ద భూమిని గుట్టుచ‌ప్పుడు కాకుండా రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేష‌న్ చేయ‌డంతో బాధితులు త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలోనే పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న మెద‌క్ జిల్లా మ‌నోహ‌రాబాద్ మండ‌లంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే...మ‌నోహ‌రాబాద్ మండ‌లం కాళ్ళ‌క‌ల్ గ్రామానికి చెందిన వ‌ర్గంటి ద‌శ‌ర‌థ‌రెడ్డి, అనంత‌రెడ్డి, కిష్టారెడ్డి అనే అన్న‌ద‌మ్ముల‌కు చెందిన స‌ర్వే నంబ‌ర్లు 485, 490, 491, 492లో సుమారు అరెక‌రాల‌కు పైగా భూమి ఉంది. అయితే వీరిలో అనంత‌రెడ్డి, కిష్టారెడ్డి  మృతి చెందారు.

కాగా దశరథ‌రెడ్డి సంత‌కం పోర్జరి చేసి ఆరు ఎకరాల పైచిలుకు భూమిని మహాలక్ష్మి అనే మ‌హిళ పేరున అక్రమంగా మనోహరబాద్ త‌హ‌సీల్దార్‌ ఆంజనేయులు అక్రమ రిజిస్ట్రేషన్ చేశార‌ని ప‌ట్టాదారుల కుమారులు వర్గంటి నాగిరెడ్డి, వ‌ర్గంటి మ‌ల్లారెడ్డి ఆరోపించారు. మంగళవారం భూమి హక్కుదారులు త‌హ‌సీల్దార్ కార్యాల‌యం వ‌చ్చి అధికారుల‌తో గొడ‌వ‌కు దిగారు. త‌హ‌సీల్దార్ వ‌ల్ల మాకు అన్యాయం జరిగిందని మల్లారెడ్డి పురుగుల మందు చేతుల్లో పట్టుకొని తాగే ప్రయత్నం చేయగా పక్కనున్నవారు లాగేసారు. ఈ స‌మ‌యంలోనే మ‌ల్లారెడ్డికి గుండెనొప్పి రావడంతో సమీప హాస్పిటల్ కు తరలించారు. కబ్జాల్లో లేనివారికి కోర్టు స్టెట‌స్ కో ఉన్నభూమిని పట్టా చేయడం వెనుక గతంలో ఉన్న తూప్రాన్ ఆర్డీవో హ‌స్తం కూడా ఉంద‌ని భాదితులు ఆరోపించారు. కోర్టులో ఉన్న భూమికి రిజిస్ట్రేష‌న్ ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత ఆర్డీవో ఎబిజిపిఎ లాక్ తీసి రిజిస్ట్రేషన్ చేయించార‌ని ఆరోపించారు. 

భారీగా ముడుపుల ఆరోప‌ణ‌...

కాళ్ళ‌క‌ల్‌కు చెందిన ఆరెక‌రాల‌కు పైగా ఉన్న భూమిని కోర్టు స్టెట‌స్ కో ఉండ‌గానే త‌హ‌సీల్దార్ ఏ విధంగా రిజిస్ట్రేష‌న్ చేస్తార‌నేది బాధితుల ప్ర‌శ్న‌. ఇందులో గ‌త ఆర్డీవోతో పాటు ప్ర‌స్తుత ఆర్డీవో, త‌హ‌సీల్దార్ కుమ్మ‌క్కై భారీ ఎత్తున ముడుపులు స్వీక‌రించి త‌మ భూమిని అక్ర‌మంగా మ‌రొక‌రికి రిజిస్ట్రేష‌న్ చేశార‌ని ఆరోపిస్తున్నారు. త‌మ తండ్రి సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి అక్ర‌మ జీపీఏ త‌యారు చేశార‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ కోర్టు కేసులో ఉండ‌గా ఎబిజీపీఏ లాక్ ఎలా తీస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. బాధితులు త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి వ‌చ్చి నిల‌దీయ‌డంతో త‌హ‌సీల్దార్ ఆంజ‌నేయులు మౌనం వ‌హించ‌డం వెనుక భారీ త‌తంగ‌మే జ‌రిగింద‌ని తెలుస్తోంది.  

జీపీఏ ప్ర‌కార‌మే రిజిస్ట్రేష‌న్ చేశాం: ఆంజ‌నేయులు, త‌హ‌సీల్దార్‌

కాళ్ళ‌క‌ల్ భూ వ్య‌వ‌హారంలో త‌మ ప్ర‌మేయం ఏమీలేద‌ని, జీపీఏ ప్ర‌కార‌మే, రెవెన్యూ శాఖ చ‌ట్ట ప్ర‌కార‌మే హ‌క్కుదారుల‌కు రిజిస్ట్రేష‌న్ చేయ‌డం జ‌రిగింది. ఫోర్జ‌రీ విష‌యం త‌మ‌కు తెలియ‌దు. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కే చేశాం.