రోడ్లపై ఆవుల స్వైర విహారం.. సారపాకలో తప్పిన ప్రాణాపాయం!
ఆవు ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు..
పంచాయతీ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
బూర్గంపాడు,(విజయక్రాంతి): ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి సారపాక బస్టాండ్ వద్ద ఆవులు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.భద్రాచలం నుంచి సారపాకకు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న గోదారమ్మ క్యాంపు ప్రాంతానికి చెందిన కర్రీ నాగేశ్వరరావు బస్టాండ్ వద్దకు చేరుకోగానే రోడ్డుపై ఉన్న ఆవులు ఒక్కసారిగా వాహనాన్ని ఢీకొన్నాయి. దీంతో వాహనం అదుపుతప్పి నాగేశ్వరరావు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఆయన ముఖం, భుజానికి గాయాలయ్యాయి. రోడ్డుపై బలంగా పడటంతో భుజం ఎముకకు చిట్లు వచ్చినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.
ప్రమాదం జరిగే వరకు వేచి చూస్తున్నారా?
సారపాక ప్రధాన రహదారులపై ఆవులు సంచరిస్తున్న విషయాన్ని గ్రామపంచాయతీ సిబ్బంది దృష్టికి స్థానికులు పలుమార్లు, సుమారు పది సందర్భాల్లో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా సారపాక పాలకవర్గం, పంచాయతీ అధికారులు స్పందించి రోడ్లపై సంచరిస్తున్న ఆవులను వాటి యజమానులు తీసుకెళ్లేలా కఠిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మరో ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించి రోడ్లపై పశువుల సంచారానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.






