19 August, 2026 | 11:14 AM

బందనకల్ లో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

19-08-2026 09:22 AM

మహనీయుల బాటలో నడవాలి 

గ్రామ సర్పంచ్ చిగురు నరేష్ 

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం గౌడ సంఘం అధ్యక్షుడు గుర్రం బాలగౌడ్,విగ్రహ దాత మాజీ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిగురు నరేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ మొట్ట మొదటి బహుజన నాయకుడు బహుజన చక్రవర్తి,అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జన్మదిన వేడుకల రోజున మన బందనకల్ గ్రామంలో పాపన్న విగ్రహావిష్కరణ చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఆగస్టు 18న తెలంగాణ ప్రాంతంలోని ఖిలాషాపూర్ గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ వృత్తిదారుల గౌడ కుటుంబంలో జన్మించారు.

తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి సర్వమ్మ పెంపకంలో పెరిగి తల్లి గౌరవార్థం తన పేరు ముందు 'సర్వాయి' అని జోడించుకుని 'సర్వాయి పాపన్న' గా ప్రసిద్ధి చెందారని,చిన్నతనం నుండే గుర్రపు స్వారీ,విలువిద్య, కత్తిసాము,బరిసె యుద్ధ విద్యలలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారని పేర్కొన్నారు.భూస్వామ్య దోపిడీపై తిరుగుబాటు మొదలు పెట్టి ఆ కాలంలో మొఘల్ సుబేదార్లు, జాగీర్దార్లు,దేశ్‌ముఖ్‌లు గ్రామీణ ప్రజలపై విధించే అధిక పన్నులు,వెట్టిచాకిరీ, దౌర్జన్యాలను చూసి పాపన్న తీవ్రంగా చలించి ప్రజలను బానిసత్వం నుండి విముక్తం చేసిన యోధుడని కొనియాడారు. మహానీయుల బాటలో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ పాలకవర్గం.గౌడ సంఘం ఉపాధ్యక్షుడు నాగరాజు మాజీ జెడ్పిటిసి యాదగిరి గౌడ్,అంజా గౌడ్,ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ గ్రామ సర్పంచ్  వెంకటస్వామి,మాజీ ఎంపీటీసీ లక్మీ వెంకటస్వామిగౌడ్,మాజీ ఎంపీపీ స్వప్న రవీందర్ గౌడ్ గౌడ కులస్తులు,వివిధ సంఘాల నాయకులు, యువకులు తదితరులు  పాల్గొన్నారు.