Kolkata Hotel Fire: హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం: 9 మంది సజీవదహనం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని(Kolkata Hotel Fire) మీర్జా గాలిబ్ వీధిలో అనేక హోటళ్లు ఉన్న ఒక పాతబడిన ఐదు అంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా కనీసం తొమ్మిది మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సుమారు 1.45 గంటలకు చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. సహాయక చర్యల కోసం పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు అంతస్తుల భవనం నుండి 80 మందిని రక్షించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి మాట్లాడుతూ, మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మృతులలో భారతీయులు, బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారని తెలిపారు. "మేము వారి గుర్తింపులను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ భవనం లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇందులో అనేక హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న తీరును చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను," అని మంత్రి పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం గురించి అడిగినప్పుడు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని మంత్రి చెప్పారు.
"అయితే, ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఫోరెన్సిక్ విచారణలో వెల్లడవుతుంది." అని సూచించారు. భవన యాజమాన్యం ప్రాథమిక భద్రతా, నిర్మాణ నిబంధనలను పాటించలేదని, హోటల్ నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సదరు యజమానిపై చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న యజమాని ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఆయన నివాసంలో సోదాలు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, అలాగే భద్రతా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా? అనే అంశాలపై విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, "నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను, ఆ తర్వాత కేఎంసీ, పోలీసులు, అగ్నిమాపక దళం, మా పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ సంస్థలకు చెల్లుబాటు అయ్యే వాణిజ్య, అగ్నిమాపక లైసెన్సులు ఉన్నాయో లేదో మేము తనిఖీ చేస్తాము. ఒకే మూడు అంతస్తుల భవనంలో అనేక చిన్న గదులతో పది హోటళ్లు పనిచేస్తున్నాయి. దీనిని అనుమతించలేము... పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు... కచ్చితంగా చర్యలు తీసుకుంటాము." అని పేర్కొన్నారు.






