10 March, 2026 | 10:31 AM

మీసేవ, ఆధార్ కేంద్రాల అధిక వసూళ్లపై చర్యలు తీసుకోవాలి...

09-03-2026 01:49 PM

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పేదల నుంచి అదనపు డబ్బులు వసూలు

ఎమ్మార్వోకు డివైఎఫ్ఐ మండల కమిటీ వినతిపత్రం

మునుగోడు,(విజయక్రాంతి): పేదలపై మీసేవ ఆధార్ కేంద్రాల దోపిడిని గుర్తించి తక్షణమే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ సోమవారం స్థానిక ఇన్ఛార్జి తహసిల్దార్ నరేష్‌కు డివైఎఫ్ఐ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మండలంలో నడుస్తున్న మీసేవ,ఆధార్ నమోదు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ పేద ప్రజల నుండి అధిక రుసుములు వసూలు చేస్తున్నాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మండల కమిటీ ఆరోపించింది.

ప్రభుత్వ సేవలకు నిర్ణయించిన రుసుములు ఉన్నప్పటికీ మీసేవ, ఆధార్ కేంద్రాల నిర్వాహకులు సర్వీస్ పేరుతో పేద ప్రజల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. కొత్త ఆధార్ నమోదు కోసం ప్రభుత్వం ఎలాంటి రుసుము తీసుకోకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఒక్కొక్కరి దగ్గర రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంగా మార్పులు చేయించుకునేందుకు వచ్చే ప్రజల నుంచి కూడా అధిక రుసుములు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

కొన్ని సేవలు నిర్దిష్ట రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టినప్పటికీ నిర్వాహకులు వాటిని పాటించకుండా “తొందరగా పని కావాలంటే అదనపు డబ్బులు ఇవ్వాలి” అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మీసేవ, ఆధార్ నమోదు కేంద్రాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్, మండల నాయకులు మహేష్, శ్రావణ్ ఉన్నారు.