18-02-2026 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 17: రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్,విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, పంచాయితీ, ముస్లిం మత పెద్దలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక నమాజ్ చేసే ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మసీదుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, వీధిలైట్లు మరమ్మతులు పై మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రార్థన ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు.
ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. ప్రధాన నగరాలలో రద్దీ ఎక్కువగా ఉండే చోట ఉన్న ప్రార్థనా మందిరాల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ కి సూచించారు. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గంట ముందుగా కార్యాలయంను విడిచి వెళ్ళుటకు అన్ని శాఖల అధికారులు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ, జెడ్పి సీఈవో శిరీష, ఆర్డిఓ వేణుమాధవ్, సూర్యాపేట కోదాడ,హుజూర్నగర్ మున్సిపల్, కమిషనర్లు హనుమంత రెడ్డి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం మతపెద్దలు షఫీ ఉల్లా, అంజాద్ అలీ సూర్యాపేట మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ షాది ఖానా కబ్రిస్తాన్ చైర్మన్, గాయబ్, అశ్రర్, ఖలీల్ అహ్మద్ ఆఫీజ్ అధికారులు పాల్గొన్నారు.