5 May, 2026 | 4:18 AM

పట్టా ఇచ్చి.. రికార్డుల్లో నుంచి మాయం!

05-05-2026 12:26 AM

గిరిజన మహిళ ఆవేదన 

క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు 

హుస్నాబాద్, మే 4: రెవెన్యూ వ్యవస్థలో జరిగిన అన్యాయంపై ఒక గిరిజన మహిళ గొంతెత్తిన ఘటన హుస్నాబాద్లో సంచలనంగా మారింది. సంవత్సరాలుగా న్యాయం కోసం తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనకు న్యాయం చేయాలని ఆమె ఆర్డీవోను ఆశ్రయించారు. హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి గ్రామానికి చెందిన లావుడ్య జ్యోతి అనే గిరిజన మహిళ సోమవారం ప్రజావాణిలో ఆర్డీవో రామ్మూర్తికి ఫిర్యాదు చేశారు.

పోతారం ఎస్ గ్రామ శివారులో 267 సర్వే నంబరులో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి, అప్పటి రెవెన్యూ అధికారులు తన పేరుతో ఆర్‌ఓఆర్లో నమోదు చేసి పట్టా కూడా ఇచ్చారని ఆమె తెలిపారు. అయితే తరువాత అనుమానాస్పదంగా తన పేరును రికార్డుల నుంచి తొలగించి, మరొకరి పేరుతో భూమిని బదలాయించారని ఆరోపించారు.

ఈ విషయమై పలుమార్లు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా, సమస్య పరిష్కరిస్తాం అనే మాటలకే పరిమితమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయగా, అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తహసీల్దార్కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ అమలు కాలేదని చెప్పారు.

న్యాయం కోసం చివరకు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కూడా తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆమె వాపోయారు. కాగితాలకే పరిమితమవుతున్న విచారణలు కాదు& అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి భూమిని ఎవరు సాగు చేస్తున్నారో పరిశీలించి న్యాయం చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి భూ సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయని, కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి తన భూమిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారి, రెవెన్యూ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.