ప్రజావాణిలో వచ్చిన ప్రతి వినతికి నిర్దేశిత గడువులో పరిష్కారం చూపాలి
కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 13, (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన వినతి కి నిర్దేశించిన గడువులో పరిష్కారం చూపాలని, వినతులపై నిరంతర పర్యవేక్షణ తో అధికారుల వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి స్వీకరించారు. భూ వివాదాలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి, నిర్దేశిత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే విశ్వసనీయ వేదిక అని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని కేవలం నమోదు చేయడమే కాకుండా, వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ఫలితాలు కనిపించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.






